పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/756

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

860

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యెవరిని గాని యెదురుగుండా నిజమైన విషయానికైనా స్తోత్రం చేయడం చాలాకష్టంగా వుంటుంది. అది వినడమునకున్నూ అసలువారి కాలాగే వుంటుంది. అందుకే కవులు ఆలాటి సందర్భాల్లో ఆయా వుదార పురుషులు తల వంచుకున్నట్టుగా కబ్బాలలో చిత్రిస్తూ వుంటారు. నేను శ్రీ ముక్త్యాలరాజావారిని గూర్చి కూడా ఆ కారణంచేతనే యెదురుగా యేమీ చెప్పలేక, యితర సందర్భంలో ఆ మాటమాత్రం సూత్రప్రాయంగా వ్రాసి కొంత ఋణవిముక్తి చేసుకున్నట్టు సంతోషింపఁగలిగితిని. కాని యింకా తృప్తి తీరిందికాదు, చిన్నతని పెండ్లికి కూడా జంకుతూ జంకుతూ శుభలేఖ వ్రాశాను. ఆ శుభలేఖ శ్రీ దొరవారికి శ్రీ చల్లపల్లిలో తమ మేనల్లుని వివాహ సందర్భంలో వుండఁగా అందిం దనుకుంటాను. ఆ చల్లపల్లి యువరాజుగారి వివాహ సందర్భంలో నాకు ఆహ్వానం వచ్చింది. యింకా అప్పటికి వారం పదిరోజులు మా చిరంజీవి వివాహము వ్యవధిలో వుండడంచేత వెళ్లఁగలిగితిని. అక్కడ శ్రీ ముక్త్యాలరాజావారే సర్వమును నిర్వహించేవారు. తమ మేనల్లుని వివాహసందర్భంలో ఆఱువందల రూపాయీలు బహుమతిగా యిప్పిస్తూ, పైఁగా, తమస్వంతమునుండి వకనూట పదహాఱు అలాయిదాగా యిచ్చారు. వివాహ సమయంగనుక ద్రవ్యం అప్రయత్నంగా నా దృష్టికి విస్తారంగా లభించడానికి సంతోషంగానే వుందిగాని, యేమిటో మనస్సులో మాత్రం కొంచెము సందేహంగా ఉండడం మానలేదు. ఎందుకురా ఈ సందేహం, అని అట్టే ఆలోచించుకున్నాను. మొదట స్థూలదృష్టికి, ద్రవ్యప్రతిగ్రహం వల్లనేమో అనుకున్నాను. అయితే మనకీ ప్రతిగ్రహం లేని దెప్పుడు? జన్మదారభ్యాయిదే వృత్తిగదా అని మళ్లా తర్కించుకున్నాను. వితర్కించుకుంటే యీ సందేహం యిప్పుడేకాదు, మొదటి నుంచీ అంతో యింతో వున్నట్లే పొడకట్టింది. దాని కింతకు పూర్వం, అనఁగా శుక్ల సం||రములో గనుక యీ సందర్భం, అప్పడికి సుమారు ముప్పదియేళ్లనాఁడు రచించిన శ్రీ కామేశ్వరీ శతకంలోని యీ పద్యం కొంత తోడ్పడింది కనుక దాన్ని వుదాహరిస్తాను.

మ. బలి పాడాయెను, గర్ణుఁడుం జెడియె, విప్రస్వాము లర్థించుకో
      ర్కెల నీఁబూని మఱెవ్వఁ డెట్లు నిలుచున్, బృథ్వీస్థలిం దాత గా
      వలదం డ్రజ్ఞులు గొంద, ఱిందుఁగల లాభంబింత గుర్తింప, రి
      క్క లికాలం బిటు కాలుచున్నయది దిక్కా ? మొక్క కామేశ్వరీ,

ఇందులో దాతృత్వమం దేమోలాభమున్నదని ప్రయోగింపఁబడింది. ఆ లాభ మేమిటంటే : సంతోషమే. ఆ సంతోషాన్ని బలిచక్రవర్తి వివరించాడు. “నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట మీఁదై నాకరంబుంట మేల్గాదే" అని.