పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/746

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

850

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గురువుగారు అన్నవరం కాఁబోలును స్వామిదర్శనార్థం వెళ్లుచూ రాజమండ్రి వద్ద రైలులో కనపడ్డారు. ఆ యీ పద్యాలు దేఖీలు సర్వమూ వినిపించి సంగతంతా మనవి చేశాను. దానికి చాలా సంతోషించారు. ఆ విషయం "ఇటీవలిచర్య" లో యిట్లుటంకించాను.

తే.గీ. ఏను ముక్త్యాల చని యటఁ గృష్ణగురుని
       కొరకుc జేసినయత్నంబు గురుఁడు తెలిసి
       కొని మహానందవారిధి మునిఁగితేలి
       కౌఁగిలించికొనియె నన్నుఁ గరము పేర్మి

యిటీవల కూడా గురువుగారికి నాయం దనుగ్రహం తప్పుట కేమీ కారణం లేదుగాని తమ ప్రతిపక్షి శ్రీ వనం సీతారామశాస్త్రులుగారితో కొల్లాపురంలో వివాదపడివచ్చి వారిశ్లోక పంచకాన్ని ఆక్షేపించి యేకర్మమూ యెఱుఁగని బ్రII శ్రీ|| పుల్లెల శ్రీరామశాస్త్రిగారిపేరితో ప్రకటించిన పిమ్మట, ఆయన వ్రాసిన సమాధానములపై అభిప్రాయాన్ని యిచ్చిన పండితుల జాబితాలో నేకూడా వుండడం వల్ల ఆగ్రహం కలిగింది. శ్రీరామశాస్త్రుల్లుగా రేకర్మయూ యెఱుఁగరని వ్రాస్తారే మీరు, ఈయంశాన్ని మీరేలా నిర్ణయిస్తారంటారేమో! వినండి. నేనెప్పడేనా రాజమండ్రీ వెళ్లడం కలదు. వెళ్లినప్పుడు సుమారు పదిపండ్రెండేండ్లనుండి శ్రీ సోమెన కామేశ్వరరావుగారింట బసచెయ్యడం అలవాటు. వారి యింటికి సమీపంలోనే శ్రీ వోరుగంటి సుబ్బారావుగారి లోగిలిన్నీ వుంది. సుబ్బారావుగారింట్లోనే శ్రీరామశాస్త్రుల్లగారి మకాం. శ్లోకపంచకవిమర్శనం ప్రకటింపఁబడ్డ కొలఁది దినాలకే ఆయన జ్వరితులై లంఖనాలు చేస్తుండఁగా, నాకు తెలిసి చూడడానికి వెళ్లాను. ఆయన క్షేమం కనుక్కుంటూ, కొంచెం నింపాదిగా వున్నట్టు ఆయన చెప్పిన తరవాత "ఇదేంకర్మమండీ? అంత అయుక్తంగా ఆ శ్లోకాలు విమర్శించారు" అని చనువుండుటచేత ఆయన్ని అడిగాను. దానిమీఁద, ఆయన నేనేకర్మమూ యెఱుఁగనని చెప్పేరు. కాఁబట్టి నాకు తెలిసింది. అప్పటికప్పుడే ఆ విమర్శనాన్ని గుఱించి యితర పండితులతో పాటుగా నేను కూడా అభిప్రాయం ఇవ్వడ మయిపోయింది. కనుక అప్పుడా వ్రాఁత సర్వమున్నూ గురువులదే అని తెలిసికొన్నప్పటికీ చేయిజాఱినదాన్ని నేను సర్దుకోవడానికి వీలిచ్చిందికాదు. అభిప్రాయం యిచ్చేటప్పుడు కూడా యిది గురువుగారిదే అని నా కనుమానం లేకపోలేదు. గాని యేమైనా వారి పేరు దానిలో లేదుగదా అనుకున్నాను. ఇదిగాక, నిజాన్ని దాచడం నా చేతకాదు. తరవాయి వినండి. నాకు అంతోయింతో శిష్యుఁడై యుండిన్నీ నేను వ్రాసినదాన్ని కాదనడానికి వీఁడెవఁడు? వీఁడి కేమధికారం వుంది? అని పిమ్మట