పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

851


గురువుగారి కాగ్రహం కలిగింది. అంతేకాని అది తమ పేరుతో లేదనే సంగతి వారు గమనించారు కారు. గురువుగారి పేరుతోనే ఆ పుస్తకం ప్రకటింపబడ్డట్టయితే అవతలివారు నన్ను నిర్బంధించడాని కవకాశం లేకపోయేది. వకవేళ నిర్బంధించినా అది ఒప్పవనివ్వండి, తప్పవనివ్వండి, మన ఆచారాన్నిబట్టి దాని విషయంలో కలగఁజేసుకోవడానికి నాకంతగా అధికారం లేనిమాటే సత్యం. ఈ ఆచారాన్నిబట్టే, వెనుక “వశ్యావశ్య" విచారసందర్భంలో శ్రీజయంతి భగీరథశాస్త్రులవారు మా తరఫున వ్రాస్తూ, అవతల తరఫున వారి గురువులు శ్రీ మహామహోపాధ్యాయ తాతారాయఁడుశాస్త్రులువారువ్రాఁతకు దిగడంతోనే చట్టన విరమించారు. అప్పుడు నేను "తనకుఁదాఁగాక తగునె యితరులయాశ?” అనుకొని స్వయంగానే వ్రాఁతకు దిగి యేదో వ్రాశాను. ఏదో అయింది. అది అన్యత్ర విస్తరించి వుండడంచేత యిచ్చట స్పృశించి వదలడమయింది. ఆ కోపంతో నన్నేకాక అభిప్రాయం యిచ్చిన పండితులనందఱినిన్నీ తూఱుపాఱఁబట్టుచూ గురువుగారు “దురుద్ధరదోష శృంఖలము" అను పేరుతో వకపుస్తకం వ్రాసి అచ్చొత్తించారు కాని ప్రకటించక నిల్పివేశారు. నిల్పిన దానిలో సంగతులు నీకెట్లా తెలిసేయియని శంక రావచ్చును. దాని నీ క్రింది పద్యములు చెప్పును గాన నుదాహరిస్తాను.

(ఇటీవలిచర్య నుండి )

తే.గీ. ఏగవలసి గుంటూరికి నేగినాఁడ
      నచట, పళ్లె పూర్ణప్రజ్ఞుడను కవివరు
      నింట నిది చిక్కెనా, కెటులేగె నటకు
      నిది, తుదకు నక్కవీంద్రుఁడు నెఱుఁగననియె.

ఈ చిక్కినది గురువుగారి పొత్తము, అని తెలియఁదగు.

తే.గీ. ఒప్పులనుగూడి తప్పులందోలి వ్రాసి
       పైని పడఁదిట్టినట్టె యద్దానిమీఁద
       ఖండనము వ్రాసి పండితాఖండలులకు
       నతఁడు చూపి యభిప్రాయ మందికొనియె.

క. వారలలో నేనొకరుఁడ
    నేరము నా మీఁద లేమి నిక్కమయేనిం
    బ్రారంభమయ్యెఁ గోపం
    బూరక నామీద గురున కోరిమిలేమిన్