పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

847


    భూదారుండవునీవు నట్టిపనికే భూయఃప్రయత్నమ్ము నా
    పాదింపంగలవాఁడవై యశము సంపాదించితో భూపతీ. - 5

ఉ. ఎందఱురాజు లెన్నికృతు లెందఱచేఁ గృతినందిరేని, నీ
    చందముగా యశంబు గనఁజాలరు, భారతమన్న వేదపుం
    గందము తాదృశంబయిన గ్రంథము కృష్ణుఁడె విప్పిచెప్పు నా
    యందముగల్గుటెట్టు లిఁక నన్యుఁ డెవండు తెలుంగుచేసినన్. - 6

వేదపుం గందము, అనఁగా వేదపుదుంప, లేదా, వేదముయొక్క గంధము (పరిమళము) కలది, అనిగాని చెప్పికోఁదగు. అసలు భారతము నన్నయాదు లాంద్రీకరించిరి. వారు భారతయుద్ధమును ప్రత్యక్షముగా చూచినవారు కారు. కృష్ణుఁడో, అట్లుకాక, ప్రత్యక్షముగా సర్వమునుచూచినవాఁడు. కావున వారి రచనకన్న నిది సర్వోత్కృష్టముగా నుండునని వ్యంగ్యమేకాక వాచ్యముకూడను. ఇందు, కృష్ణపదము శ్లేషించుటచే ఇట్టి యర్ధవిశేషము వచ్చినదని యెఱుంగవలెను.

తే.గీ. ములుగు పాపయారాధ్యులు మున్ను దేవి
       భాగవతమును మీవంశపార్థివుల స
       మక్షమందె తెలింగించె నంతకన్న
       వేయిరెట్లు భారతకృతి విభుతమిన్న - 7

శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయఁడుగారి ప్రభుత్వపు దినములలో రచింపఁబడిన పాపయారాధ్యులవారి యాంధ్రభాగవతము జగ్గయ్యపేటలో యీ ప్రయాణములోనే నేను చూచినాను. ఇంకను అది ముద్రితము కాలేదు.

శా. ఎన్నోపున్నెము లీవు మీకులజు లా యీ రాజ్యముంబూని మున్
     ము న్నార్జించియెయుందు, రయ్యవియు విస్ఫూర్జద్యశస్స్ఫీతికిన్
     వన్నెంబెట్టఁగఁజాలియున్ బ్రకృతమై భాసిల్లు నీ భారతం
     బన్నన్ దత్కృతు లన్నిటిన్ మిగిలి నీకర్పించె నత్యున్నతిన్. - 8

ఉ. ముం దెటువంటి సద్యశము పొందెదొ! యిప్పుడె రాజరాణ్న రేం
    ద్రుం దలఁదన్నితీ వధిపఁ రూఢిగనిన్ జనమేజయాచలేం
    ద్రుం దులదూఁగఁజేయుటకుఁ దొల్లి యొకింత యతించినాఁడ, నేఁ
    డందులకే యతించెదఁ గృతార్థుఁడ నయ్యెదనన్న నమ్మికన్. - 9