పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/744

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

848

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఇందు, రాజరాజనరేంద్రుఁడు నన్నయభారతమునే కృతి పొందుటచే, అయ్యది దాదాపు మూఁడుపర్వములే కనుక, శ్రీముక్త్యాలరాజావా రప్పటికే అయిదుపర్వములు కృతినందియుంటచే రాజనరేంద్రుని మించినట్లు తెలిసికోవలెను. జనమేజయుఁడు యావద్భారతమును వినుటచే నాయత్నమట్లు చేయవలయునని యున్న ట్లెఱుఁగఁగదగు. "తొల్లియొకింత యతించినాఁడ" అనుమాటకు సందర్భమెట్టిదో నాకు జ్ఞప్తియందు లేదు. దీనిం గూర్చి శ్రీరాజావారుగాని శ్రీ మా గురువుగారుగాని వ్యాఖ్యాతలు కావలెను. ఈ భారతములో కొంతభాగము మరియొకరికి అంకితము కాకూడదనియు, మీకే సర్వమును అంకితము కావలెననియు నాతాత్పర్యమని చదువరు లరయఁగలరు. ఈ యభిప్రాయము కూడా అపరాధంగానే గురువుగా రిటీవల భావించారు. అది ముందు తెలుస్తుంది.

శా. అంతేవాసిని నేను గృష్ణకవి కత్యంతమ్ము నాయందు నా
     యంతర్వాణికిఁ బ్రేమమగ్గలము నీయాంతర్యమో నన్ను న
     శ్రాంతమ్మున్ గమనించు, నిట్టియెడఁ “గార్యంబేల కాకుండు" నం
     చెంతున్ స్వాంతమునందు, నిక్కము జయంబే నాకుఁ జేకూరెడిన్. - 10

శా. శ్రీనాథుండటఁ దొల్లి వేమవిభుతో సింగక్షమాభర్త కెం
     తేనిన్ వైరముమీఱియున్న తఱిఁ దానేయేగి సింగక్షమా
     జానిన్ సత్కవితావినోదమున మెచ్చన్ జేసి తద్వైరమున్
     మానించెన్, గవిరాజవైరమును నే మాన్పింతు నారీగతిన్ - 11

కవి యొక్కయు రాజు యొక్కయు అనియును, కవిరాజుగారి యొక్కయు అనియునర్ధము. శ్రీనాథుఁడు వారించినది, రాజునకును, రాజునకును గల వైరము. ఇదియో కవికిని రాజునకును సంబంధించిన వైరమని విశేషము. -

శా. నా తోఁబుట్టువు భారతంపుఁ గృతికి న్నాథుండ వీవౌటచే
     నీతోఁ జుట్టఱికంబు నాకొదవుటన్నే నిన్ను విన్పింపఁగా
     నేతున్ గృష్ణ కవీంద్రుఁడో? వినెడి మన్పేనాకు, నింకేటికో
     కాతర్యంబు, నరేంద్ర భావుక యశఃకాంక్షన్ బ్రవర్తించెదన్. - 12

ఇందు గురువు తండ్రివంటివాఁడనియు, తత్పుత్రిక అనఁగా "కవి జనకుఁడు" అను సంప్రదాయము ననుసరించి ఆయన భారత మాయనకుఁ గొమార్త యగుటచేనాకు తోబుట్టువగుననియు గ్రహింపనగు. మఱియు, "నరేంద్రభావుక" అనుచో ఆకృతికన్యకకు నీవు పెనిమిటి వగుటచే నాకు నీవు బావవు గనుక నిన్ను బావా! అని సంబోధించుచున్నానను