పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

846

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఈ పద్యానికి సుమారొక గంటసేపు వ్యాఖ్యానం చేసినట్లు జ్ఞాపకం. పైకి వ్యాఖ్యానం చేస్తూవున్నట్టు కనిపించినా, నేను లోపల చేస్తూ వున్నపని వేఱు. యేమిటంటే మొదటి పద్యం చదివేటప్పటికి నాకీ వూహలేదు గాని, చదువుతూవుండఁగా మా రెండవగురువుగారు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రుర్లు గారు శ్రీరాజావారికి అంకితంగా (అంకితం గాదని మూ గురువుగారు కోర్టులో వాదించారు కాని ఆవాదం తుదకు నిల్వదు) భారతం తెలిఁగించడమున్నూ, వారు నెల 1 కి రు. 116–0–0 పంపించడమున్నూ యిటీవల వీరిరువురకున్నూ మనోమలికలు కలిగి రిజిస్టరు నోటీసులు జరగడం వగయిరాలున్నూ దైవవశంగా స్ఫురణకు వచ్చి, మన మెట్లేనా వీరిద్దరికిన్నీ ఇటీవల కొంతకాలం నుండి జరిగే కలహాన్ని నివారించడానికి ప్రయత్నిద్దామని తోఁచి, వట్టి పొడిమాటల్లో కన్న ఛందోబద్ధంలో జీవం యెక్కువుంటుందని మనస్సులో ఆ విషయమైన పద్యాలు అల్లుకుంటూ వున్నాను. కాని ఆ పూటే వినిపించినట్లు జ్ఞాపకం లేదు. మధ్యాహ్నం పాట కచ్చేరీ అయిన పిమ్మట పొద్దుటి ఆశీర్వచనప్పద్యంలోవున్న "ముక్తీ లేశున్” అన్న పదము నెత్తికొని, శ్రీమా గురువుగారు కూడా "ముక్త్యాల” పదమునకు “ముక్తీల" అనియె భారతంలో వాడినారు. అని ప్రసక్తి కల్పించికొని గురువుగారికిని శ్రీ రాజావారికిని కల వైషమ్యము తొలఁగించాలనే వూహతో ఆ యీ పద్యాలు వినిపించాను.

సీ. నీ భారతామ్నాయ నేతృత్వ మదియనే
                తాదృశైశ్వర్యప్రదమ్ముగాఁగ
    నీ తనూజాతుండు నీతిచే భూతిచే
                ఖ్యాతిచే విస్ఫీతకరుఁడుగాఁగ
    నీదు జీవిత మొక్కనేఁడెగా కాకల్ప
                మాదిరాజయశోవినోదిగాఁగ
    నీదు సంస్థాన మానీత సత్కృత నిరం
                తర కవిగాయకోత్కరముగాఁగ

తే.గీ. నాయురారోగ్యభాగ్య మహామహప్ర
      భూతవిఖ్యాతిముఖ్య విభూతి కిప్ప
      టట్లే యెప్పుడునిలయమై యలరుమయ్య!
      అర్ధిజనకల్పభూజ ! ముక్త్యాలరాజ ! - 4

శా. గోదాతీరమునందు భారతము దిక్కూలంకషోద్య ద్యశః
    ప్రాదుర్భావుఁడు రాజరాజు (రాజరాజనరేంద్రుఁడన్నమాట)
                                              రచియింపన్‌జేసెఁ గృష్ణానదీ