పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/741

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

845

ఆనాఁడు సంధ్యాకాలాని కావూరు ప్రవేశించానని వ్రాశాను. సంగీతసభలో శ్రీవారి దర్శనం నాఁడే చేసినట్లు జ్ఞాపకం. మఱునాఁడు ఉదయం శ్రీహరి నాగభూషణం గారి పాట. ఆ పాటకచ్చేరీ తుట్టతుదను శ్రీ రాజావారి మీఁద వకపద్యం ఆశీర్వచనంగా చెపుతూ నాగభూషణం గారిని గూర్చి కూడా వకపద్యం చెప్పాను. ఈ రెండింటికీ మధ్య వకపద్యం కూరగాయది చెప్పి అప్పటి నా వయఃపరిమితి వగైరాలను ముచ్చటించాను. ఆ యీ పద్యాలుదాహరిస్తా నిచ్చట.

శా. శ్రీలన్ జాలఁ జెలంగుచుండియు సదా చెయ్వుల్ తపోవేదశా
    స్త్రాలీఢమ్ములుగాఁగ జీవితము శ్లాఘ్యం బౌగతిన్ బుచ్చు ము
    క్తీలేశున్ మన చంద్రమౌళివిభు ముక్తీశుండు రక్షించుఁగా
    కే లోపమ్మును లేక కాల మఖిలం బీలాగె కాలాఁగఁగన్ - 1

తాత్పర్యము సుగమమే కనుక విస్తరింపను. అప్పుడు సంగీత సాహిత్యాదులతో నృపుఁడు కాలక్షేపం చేయుచుండడంచేత, కాలమెప్పుడూ యిలాగే నిల్చి ఉండాలి, అన్నది ప్రకరణానికి సంబంధించిన విశేషం, యిఁక తరువాయి పద్యం -

తే.గీ. శిష్యులకుఁగూడcదల నరసినది కొంత
      నాకు దల యొక్కటియకాదు నరసె మీస
      లిట్టిచో నేఁ గయిత సెప్పనేల యయినఁ
      జెప్పకేతప్ప కొక్కింత చెప్పుచుంటి. - 2

ఈ పద్యంలో వున్న శిష్యుల పేళ్లు కొన్ని వుదాహరించేవున్నాను. నా వయస్సప్పటికి సుమారు యేభై అయిదేండ్లు.

తరువాయి పద్య ముదాహరిస్తాను.

తే.గీ. తఱచుగా రామశబ్దంబు తాఱుమాఱు
       చేసి నాగభూషణుఁడు వచించుమాట
       కర్థ మో చంద్రమౌళిధరాధినాథ !
       “ఏను సంగీతపున్ మర నెఱుఁగు" మనుట
       దీర్ఘ మేలన? నదియు గీతిగుణ మధిప. - 3

“రామ" శబ్దాన్ని తలక్రిందుచేస్తే “మరా” అవుతుంది. మన కిక్కడ కావలసింది “మర” కాని, “మరా” కాదు. అయితే సంగీతంలో అలాటి దీర్ఘాలు లెక్కలేదని సమాధానం.