పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/733

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

837

అని వచింపలేదా? శ్రీ శాస్త్రులవారు నా శిష్యత్వమువలన తమకు "వచ్చెడి గౌరవములే” దనుకొనుచున్నారు. అది సత్యమే కావచ్చును. నే నట్లనుకొనుటలేదు. వారి గురుత్వము వలన నాకు గౌరవము కలదనియే నేననుకొనుచున్నాను. కావుననే జాతకచర్యలో

చ. "కదలి యనంతరం బచొటు కాటవరంబను నొక్క పల్లె కిం
     పొదవఁగ నేగ నయ్యెడల నొండువిధమ్మునఁగాక భుక్తియున్
     జదువును సంఘటించుటయు సర్వసుఖమ్మగు నట్టి యచ్చోటన్
     గదలక కొంతకాల మెసకమ్ముననుండెఁ గలార్జనాదృతిన్."

తే.గీ. “అచట శ్రీపాదవంశజుఁ డనఘమూర్తి
       కృష్ణమూర్త్యాఖ్య సుకవివరేణ్యునొద్ద
       మొదలిడి కుమారసంభవమునను రెండు
       సర్గలు పఠించె మూఁడుమాసములలోన”

ఉ. “ఆ యనఘుండు దీక్షిత సమాహ్వయుఁడున్ సవయస్కుండౌసహా
     ధ్యాయియుఁ గూడి నూత్న కవితాభ్యసనాదరులౌట, లక్షణం
     బేయెడఁ జర్చసేయునపు డీతఁడు తానొక కొంతకొంత, త
     చ్ఛ్రీయు గ్రహించె వారలది చెప్పకమున్న స్వబుద్ధిపద్ధతిన్"

ఒక శంక, చెప్పకుండఁగనే గ్రహించినది పై లక్షణజ్ఞాన మెంతయని చదువరులు శంకింతురేమో, ఎంతోకాదు. వర్గయతి వఱకు మాత్రమే.

తే.గీ. “అట్టి లక్షణలేశసంప్రాప్తికతన
       మున్న యించుక కవనంబు మొనసి "ఉప్పు
       లేని సామెత" జరియించు వీనికంత
       నబ్బె నకలంక పదకవిత్వాతిశయము.”

కాటవరము వెళ్లుటకు పూర్వమే యానాములో నామీఁద కోర్టులో కవిత్వపు సంబంధమైన కేసు వచ్చుటచే శ్రీశాస్త్రులవారి వద్దకు వచ్చునప్పటికే నేను తప్పో ఒప్పో పదకవిత్వ మల్లుచుంటిననుట స్పష్టము. ఇతరత్ర ఈ విషయము విస్తరింపఁబడినదే.

తే.గీ. "అట్లు రచియించి వారల కరయఁజేయ
       వారలవిగాంచి యొక్కింత పరిహసించి
       "ఇప్పుడ కవిత్వ మొనరింప నెంచెదేని
       చదువు చెడుఁగాన నయ్యది వదలుమనిరి."