పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

838

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తే.గీ. “గురువుఁ దత్సహపాఠియుఁగూడి తఱచు
       ఆడుచుందురు చదరంగ మట్టియెడల
       లక్షణంబెట్టు లట్ల తల్లక్షణంబు
       నితఁడు గ్రహియించె నాదర మెసక మెసఁగ."

తే.గీ. “అంత మేఘసందేశకావ్యమును మొదలువెట్టి - చదు
       వుచునుండంగ విఘ్నకార - ణం బుదయమందె......"

చ. "...... గురునింతి మృతింగనె నాత్మదేహమం
    దొదవె నొకించుకంత జ్వరయోగము. ఇంటికే
    గెదనని పేర్మి నగ్గురునికిన్ వచియించి... చనె...."

ఇత్యాదులు మునుదాహరించినవేయైనను దార్థ్యార్ధము మరల నుదాహరింపఁబడియె, కావున పునరుక్తిగా నెంచవలదు. ముమ్మాటికి నిదియే నా కాటవరపు విద్యాభ్యాసము కుమారసంభవములో, ప్రథమములో కొంత, తృతీయములో కొంత, పంచమములో కొంత మొత్తము మూఁడు సర్గలలోఁ బాఠము జరిగినను, పూర్తిగా మూఁడును కానందున రెండు సర్గములగ్రంథము చదివినట్లయినది. అయిదు మాసముల కాల మచట నున్నను అనివార్యములగు విఘ్నములవలన మూఁడు మాసములు మాత్రమే చదువు జరిగినకాలము. ఆ మూఁడు మాసములలోనే పూర్వమేఘములో 29 శ్లోకములు కూడనైనవి. పద్యములో సూత్రప్రాయముగా వ్రాయునపు డీ కాకదంతపరీక్ష కవకాశము కలుగదుగాన స్థూలారుంధతీ న్యాయముగా నుదాహరింపఁబడియె. మేఘసందేశము చదువుచు నేను కాటవరపు శిష్యత్వము నుండి విరమించి, స్వగ్రామమువెళ్లి కొన్నాళ్లుండి, పిమ్మట, కాజులూరి శిష్యత్వము మొదలిడి మూఁడు మాసముల కాలము సుమా రచట పూర్వమేఘము తరువాయి చదివినను, మిగిలిన ముప్పదినాల్గు శ్లోకములలోఁ గొన్ని మిగిలియేయున్నవనుట యథార్థము. పద్యములో “మొదలిడిన పొత్తమది తుదముట్టదయ్యె,” అనునదికూడ స్థూలదృష్టిని వ్రాసినదే. పొత్తమనుచో..."సర్గము" అనుట యుక్తము. ఇట్లు వ్రాయుట చేతనే జాతకచర్యలో నొకచోట క. “ఏ విషయము సంగ్రహముగనే వ్రాయంబడియెనిందు.” అని వ్రాసియుంటిని. ఇట్టి స్వల్ప విషయమే యైనచో నేను ప్రస్తుత మనారోగ్యస్థితిలో ఈ వ్యాసము వ్రాసి, నాయంత కాకున్నను, కొంత అనారోగ్యస్థితిలోనే యున్న గురువుగారికి మనఃపరిశ్రమ కలిగింపనెంచను. ఆ యీ విషయము నేనిపు డేనాఁటి చర్య ఆనాఁడుగా వ్రాయుచున్న"జాతకచర్య - ఇటీవలి చర్య" అను పొత్తములో విపులముగా వ్రాసియున్నాను. "ఇటీవలిచర్య" అనఁగా షష్టిపూర్తి జరిగిన పిమ్మట చరిత్రమని తాత్పర్యము. షష్టిపూర్తి