పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/732

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

836

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


జ్యేష్ఠమాసము. అటనుండి జ్వరపడి పథ్యము పుచ్చుకొని యింటికి బయలుదేరివచ్చినది కార్తీకమాసము. కనుక అయిదుమాసములని నేను వ్రాసినాను. చదువు జరిగినది మూఁడు మాసములే కనుక అట్లు చెప్పినాను. ఈ విషయము జాతకచర్య పీఠికలో కూడ కలదు. జగన్నాథస్వామిగారు గీరత ప్రథమభాగస్థమగు "ఐదుమాసముల్" అనుమాట చదివిన పిమ్మట వ్రాసిన పద్యములోఁగూడ “మాసచతుష్కమయ్యు" అని వ్రాయుటకక్కడ "మాసపంచక" శబ్దముపడినచో గణభంగమగునని యూహించి "ఈషద్వైషమ్య మవివక్షితం" అను నార్యోక్తి ననుసరించి నట్లూహింపనయ్యెడిని. చదువుమాట దేవుఁడెఱుఁగును. నేను అయిదుమాసములకన్న నెక్కుడు కాలము కాటవరములో విద్యార్థిగా నున్నట్లు శ్రీవారు నిరూపించఁగలరా? శ్రీవారి తండ్రిగారి యజ్ఞము, తోఁబుట్టువు పెద్దవేణయ్యగారి సన్నిపాతజ్వరము, వీరి యిల్లును, రెంటాల వీర్రాజుగారి యిల్లును తప్ప, గ్రామమెల్ల వరదవలన మునిఁగి పెద్ద యుపద్రవము సంభవించుట, శ్రీవారి జ్యేష్ఠభార్య జ్వరముచేతనే స్వర్గస్థురాలగుట, పిమ్మట రేకపల్లె లచ్చయ్యశాస్త్రులవారి తమ్ములు రామమూర్తిగారు జ్వరమువలన స్వర్గస్థులగుట, ఇవి యన్నియనేనుండఁగ జరిగినవేకదా? ఈ సందర్భములో కొంచెము జ్వరమువచ్చి నేను భయపడి యింటికి చేరితిని. ఆయీ యంశములు, పెండేరపు సభకు మోటారులో శ్రీ వడ్డాది సుబ్బారాయకవిగారును, తామును, నేనును ఊరేగింపు మిషతో వెళ్లునపుడు త్రోవలో శ్రీ శాస్త్రులవారిని ప్రశ్నించి, ఔనని యనిపించుకొంటిని. శాస్త్రులవారికీ సందర్భము జ్ఞప్తియందున్నదో లేదో! నా కానాటి, అనఁగా కాటవరపు విద్యార్ధిత్వమునాఁటి, సంగతులన్నియు జ్ఞప్తియందున్నవి. ఆఉండుటయే కాదు, కన్నులకు కట్టినట్లు కనుపడుచుండును. అప్రస్తుతము లగుటచే మఱికొన్ని సంగతులు కూడ నిప్పటికి తూచా తప్పకుండ నాకు జ్ఞప్తిలో నున్నను, అయ్యవి యిచ్చట వ్రాయలేదు. అవికూడ వ్రాసితినేని శ్రీవారు మిక్కిలిగా నాశ్చర్యపడుదురు. అప్పటివారిలోశ్రీ కాకరపర్తి వేంకటరాయఁడుగారును, ఈయన తోఁబుట్టువు లిరువురును ఇప్పటికి జీవించియున్న ట్లెఱుఁగుదును. శ్రీవారు మఱచినచో నేనక్కడ నున్నకాలమును వీరు చెప్పఁగల రనుకొందును. కాని శ్రీవారికీ సాక్ష్యముతో పనిలేదు. వారు నేను తమ ప్రతికక్షియగు పండితునికి తమకు వ్యతిరేకముగా మంచి యభిప్రాయము నిచ్చుటచే కుపితులై అట్లు నా విద్యార్ధిత్వమును దీర్ఘీకరించిరని తోఁచెడిని. ఒకరోజు శిష్యుఁడన్నను ఒకటే, ఒకయేడు శిష్యుఁడన్నను ఒకటే. నేను శిష్యుఁడనే, వారు గురువులే. నే నెంతో నిష్కల్మషముగా వర్తించుచుంటిని. గండపెండేరపు సభలో

చ. “గురువులు పల్వురుండినను కొంకక నేఁటికి నిల్చియున్న మ
     ద్గురుఁ డొకరుండె. శ్రీపదు డకుంఠిత తేజుఁడు కృష్ణమూర్తి..."