పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుగుడుపు

809


ఆగి, తరవాత ఆలోచిద్దామంటే, పడమటి రైలుకూడా యీచిక్కే వచ్చి అదీ వచ్చిందికాదు. ఈ అభావచేష్టలు చూస్తే ప్రయాణం వైఖరి బాగుందికాదు. నిజానికి వెన్కకి వెళ్లవలసింది. కాని నేను వీట్లని లెక్కపెట్టకుండా స్టేషనులోనే వుండి, కొంత ఆలస్యంగా వచ్చిన రైలెక్కి నాటికి పిఠాపురం వెళ్లి ఆగి, మఱునాడు లేదు మూడోనాడు విశాఖపట్నం ప్రవేశించాను.

లక్ష్మీకాంతం సంతోషించి హాస్పటల్ వారితో సంప్రతించి వైద్యం చేయించడాని కారంభించాడు. అక్కడ బొడ్డపాటి తిరుమల్రావు అనే డాక్టరు యిక్కడి స్కూలు శిష్యత్వం కలవాడే అవడంచేతనేమి, స్వతస్సిద్ధమైన మార్ధవంచేత నేమి, కంటివైద్యం డాక్టరుగారితో “యీయన మా గురువుగారు” అని గట్టిగా శిఫారసు చేశాడు. కంటి డాక్టరుగారు చేయదగ్గ పరీక్షలు చేశారు. పరీక్షలు చేయడానికి ముందు రెండు మూడురోజులు కంట్లో మందువేసి చూశారు. ఆ రోజుల్లో నా స్థితి కొంచెం వ్రాస్తాను. లక్ష్మీకాంతం తనకు తీరిక లేకపోయినా నన్ను వెంటబెట్టుకొని హాస్పటలుకు తీసుకువెళ్ళేవాడు, అతని వూహ యేమిటీ? శాస్త్రులుగారి కక్కడ ఏం లోపం జరుగుతుందో అని. పాపం, నా గ్రహస్థితికి అతడేం చేస్తాడు? “అవస్థా పూజ్యతే రామ." అక్కడ నేను చదువుకొనే గ్రూపులోనే కూర్చోక తప్పుతుందా? ఆ గ్రూపో, రెండు కళ్ళూ లేనివాళ్ళూ, వక కన్ను లేనివాళ్ళూ, కళ్లంట నీళ్లోడేవాళ్ళూ, యీలాటి వాళ్లతో నిండి వుండేది. యీ కర్మమే లేకపోతే హాస్పటలు కెందుకు వస్తారు? చదువక్కఱలేని వాళ్లు స్కూలు కెందుకెళ్లాలి? మాస్టర్లయితే జీతం కోసం వెళ్లాలి. అక్కడ మాస్టర్లు డాక్టర్లు, మేము విద్యార్థులం. యీ పోలికా యిదీ కొంతబాగానే వుందిగాని, ఆ గ్రూపులో కూర్చున్నప్పుడు నాకు పట్నవాసాల్లో ఆదివారం తిరిగే ముష్టివాళ్లు జ్ఞాపకం వచ్చేవారు. యెవళ్లకేనా ఆలాంటివూహే కలుగుతుందనుకొంటాను. నేను అంతో యింతో కవినవడంచేత యీ చవట పోలికలు నన్ను మఱీ బాధిస్తాయనుకొంటాను.

ఒకరోజున లక్ష్మీకాంతం రావడానికి వీలులేక వక విద్యార్థిని సాయమిచ్చి పంపించాడు. ఆవేళ కూడా మామూలుగా ఆ గ్రూపులోనే వెళ్లి నేను కూర్చున్నాను. అలా కూర్చొని ఆ రోగుల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ నా కష్టసుఖాలు అడిగేవాళ్లకు చెబుతూవుండగా, యెవరో మా దేశం మనిషి, నన్ను యెఱిగినాయన, ఆ హాస్పటల్లో పేషెంటుగా కొన్నాళ్ల నుంచి వుండడంచేత కొంత పాతకాపు, ఆ డాక్టర్ల వద్ద కొంత చనువు కలిగినవాడు నన్ను చూచి, యిదేమిటి? మీరిక్కడ కూచున్నారు, యిలా దయచేయండి, అని చేయట్టుకొని లాక్కెళ్లి, పాపం, అమాయికుడు, మా డాక్టరుగారి రూములో వున్న వక కుర్చీమీద కూర్చోబెట్టేడు. నా కక్కడ కూర్చోవడం లేశమున్నూ యిష్టంలేదు. లోపల బోలెడు భయంగా వుంది. వుండి మాత్రం యేం చేయను? కూర్చో