పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/706

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

810

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పెట్టిన వారి మోమోటం బాధించింది. అంతలో మా డాక్టరుగారు వచ్చారు. సాగనంపారు. తిరుమలరావుగారి శిఫారసు పనిచేయలేదా అనుకోకండి. ఆ శిఫారసు వైద్యానికా, కుర్చీమీద కూడా కూర్చోనివ్వడానికా అని నేను సరిపెట్టుకున్నాను. ఇదిగాక యివన్నీ గ్రహచారా న్ననుసరించి ప్రతివాళ్లకిన్నీ ఘటిస్తూండేవే. కవులకయితే పదిమందికి తెలుస్తాయి. యితరుల వంతగా పబ్లిషుకావు. యింతే భేదం. యోగజాతకాలలో అవయోగాలు తక్కువగా వుంటాయి, అవయోగ జాతకాల్లో సుయోగాలు క్వాచిత్కంగా ఉంటాయి. వుభయమున్నూ అనుభవానికి వచ్చి తీరతాయి. యీ విషయం అనుభవజ్ఞు లెవరున్నూ తోసెయ్యరు.

ఇదీలావుంచుదాం. కంటిజబ్బుకు వైద్యం ప్రస్తుతం. అది వంటి జబ్బుకింద మాఱింది. యెందుకు మాఱిందంటే నేనేం చెప్పగలను? కర్మం, లక్ష్మీకాంతం హాస్పటల్ డాక్టర్లతో తుల్యులైన వారినే యేర్పఱచి యింటి వద్దనే తరువాత వైద్యం చేయించాడు. వుపకారం జరిగిందికాదు. అతడూ, అతని కుటుంబమూ సర్వవిధాలా వక నెలరోజులు వుపచారం చేశారు. యేట్లో యింటికి చేరేను. తరువాత కూడా యేడెన్మిది మాసాలు చిక్కుపడ్డాను. ఆ చిక్కు పడేరోజుల్లోనే రెండో మామగారు వేంకటేశ్వరరావు బందరులో వైద్యం చేయించాలనే వూహతో కొంత ప్రయత్నించాడు. మా గ్రామం వచ్చాడు కూడాను. కాని యిల్లు కదిలే స్థితి లేదు. విశాఖపట్నంలో వున్నప్పుడు ఆరోగ్య భాస్కరంలో నా స్థితిగతులు సూక్ష్మంగా వ్రాశాను. తరువాత కడియంలో అదిముగించి మృత్యుంజయ స్తవమను పేరుతో నాకప్పుడు కలిగే వూహలు వ్రాశాను.

అదల్లావుంచుదాం. వేంకటేశ్వరరావు కే.యన్. గిరిరావుద్వారా కొన్నిమందులు పంపేడు. మందులయందు విశ్వాసంలేక, నేనాపార్శిల్సు విప్పనేలేదు. నా కవిత్వమేమిటో, నేనేమిటో, యింకొక టిక్కడ వ్రాయాలి. నా కవిత్వం వల్ల తమమందు పనిచేయడాని కవకాశం కలగడం లేదని కొంతమంది డాక్టర్లనేవారు. నేను కవిత్వం ప్రయత్నం మీద చెపితే మీరాలా అనండి, నాకుతోచింది వ్రాయకపోతే యేలాగ? అది కడుపులో నిలవ వుండడానికి మాత్రం మీ వైద్యశాస్త్రం వప్పుతుందా? అదిన్నీగాక. అది “ఫారిన్ మేటరు” కదా? అని నేజవాబు చెప్పేవాణ్ణి. చెపితేమాత్రం వారంగీకరిస్తారా? వారి ధోరణివారిది. మన ధోరణి మనది, యిందులో వక విషయం మన మాలోచించాలి. యెవడుగానేనా పుట్టవచ్చునుగాని, వైద్యుడుగా పుట్టడంలో చాలాచిక్కు మందు పనిచేసిందా, ఆలాంటప్పుడు వైద్యుడుగా పుట్టడమే మంచిదనిపిస్తుంది. లేదా జవాబు చెప్పడం చాలా కష్టం. రోగి చెప్పే సంగతులు అదివఱలో తమకే గోచరించినట్లు యేకరు పెట్టబోతారు కొంతమంది. సరీగా వారు చెప్పినట్టు వీడునడుచుకున్నా దానిలో యేదో ఆరాతీస్తారు. కొందఱు సామాన్య