పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

808

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


దొంగతనంగా కాక, పబ్లీకు టవున్ హాలులోనే జరిగింది. జరిగి యిప్పటికి యేడాది దాటిపోయింది కూడాను. యిప్పటికి యెవ్వరున్నూ కేసు పెట్టలేదు. కాబట్టి నేను పెండ్లాడనే లేదని కాని, అసలు పెండ్లికూతురు కన్యేకాదని గాని కోర్టులో డిఫెన్సులు పెట్టుకోవలసింది లేదని మహాదైర్యంగా మీయెదుట వుపన్యసించగలుగుతూన్నాను.

ఇక మనుగుడుపు గాథ వినండి. పెండ్లికొడుకు అదృష్టమంతా పెండ్లికూతురు పాదాన్ననుసరించి వుంటుందని ప్రాచీను లభిప్రాయపడతారు. “భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీఫల మిదమ్" ఇత్యాదులు అభియుక్తోక్తులెన్నో పైసంగతిని సమర్థిస్తాయి. కాబట్టి యీ పెండ్లి కూతురిని కట్టుకొన్నాక నేను చాలా జబ్బుపడినప్పటికీ తిరిగీ పెండ్లయిన యీ వూరికి వచ్చి మిమ్మలినందఱినీ దర్శించి ఆనందించగలగడం అన్నది పెండ్లికూతురు చలవేకాని మఱోటికాదనడం నిర్వివాదాంశం. యిలా కాకపోతే జబ్బుపడడం వల్ల ఆ జబ్బుక్కారణం యీ పెళ్లే అనియే యెందుకనుకో గూడదని మీరు శంకింపవచ్చును. స్థూలదృష్టిని చూస్తే అట్టి వూహకూడా కలగవచ్చుగాని, అఱవై నాలుగేండ్ల వృద్ధుడు జబ్బుపడడానికి కారణం అన్యుల మీద పెట్టడంకన్న వయస్సు మీదే పెట్టడం యుక్తియుక్తంగా వుంటుందనుకొంటాను. అట్టివృద్ధత్వంలో యెంతోజబ్బుచేసి కూడా మరల జీవించి సభలకు రావడం వగయిరాలు జరగడానికి అంతో యింతో శక్తి కలగడమనేది పెండ్లికూతురు చలవనుకొంటేనే బాగుంటుందేమో ఆలోచించండి.

దీన్నీలావుంచి పైసంగతి వినండి. పెండ్లయింది. సకుటుంబ పరివారంగా బెజవాడత్రోవను మాగ్రామం ప్రవేశించాము. బెజవాడపౌరుల ఆదరంవల్ల కొన్ని వుపన్యాసాలక్కడ జరిగాయి. పెండ్లికి వచ్చేటప్పుడు కూడా వేమూరి రాంజీరావనే శిష్యుడు పరివారసమేతంగా మిక్కిలి భక్తితో విందు చేశాడు. వెళ్లేటప్పుడు కూడా అతనికే విందు చేయాలని కుతూహలం మిక్కిలిగా వుంది కాని, డాక్టరు ఘంటసాల సీతారామశర్మలోనైన శిష్యవర్గం వదలిపెట్టేరు కారు. కడియం ప్రవేశించిన తర్వాత వెనువెంటనే నాకు కుడికన్ను ఱెప్ప హఠాత్తుగా వాలింది. దానితో తల తిప్పు, ఈ రెండింటితో నేను యెందుకూ కొఱగాని స్థితిలో వుండవలసిన వాణ్ణైనాను. ఈ సంగతి బందరులోవున్న మామగారు వేంకటేశ్వరరావుకు తెలిసింది. విశాఖపట్నాని కతడు వ్రాశాడు. విశాఖపట్నం మామగారు వైద్యానికని తన దగ్గఱికి రప్పించాడు. వున్నంతలో మంచిముహూర్తం చూచుకొని మా పెద్ద చిరంజీవిని సాయంతీసుకొని ప్రయాణం చేశాను. రైలారోజున పిఠాపురాని కావలగట్టు చెడిపోవడంచేత మా కడియానికి సకాలానికి వచ్చిందికాదు. యెదరవచ్చేది రాకపోయినా, విశాఖపట్నం వెళ్ళేదేనా సకాలానికి వస్తుందేమో, పిఠాపురందాకా వెళ్లి, నాటికి ఆ వూళ్ళో