పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/703

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

807మనుగుడుపు

(17-11-1934 సం||ర కృష్ణాపత్రిక నుండి)

ఈ పదమున కవయవార్ధం చెప్పమంటే చెప్పడం కష్టంగాని, యీ మాట ఆబాలగోపాలంగా మాత్రం అందఱూ తెలుసుకొంటారు. ప్రతి పెళ్లికొడుక్కున్నూ పెళ్లయిన వెనువెంటనే అత్తవారింట కొన్నిరోజులో మాసాలో, జరిగే విందు పేరిది. నాకు పెండ్లయి నలభైనాలుగేండ్లు సుమారైనప్పటికీ, యీ మధ్య తిరిగి వక కన్యకను కట్టుకోవడంచేత యీ విందు మళ్లా తటస్థించింది. ఆ కన్య యెవరు? మామగారెవరు? అత్తవారూరిపేరేమిటి? అని అడిగితే చాలా వ్రాయవలసి వస్తుంది. ఒక మామగారు గాక యిద్దఱు మామగార్లు, దీన్ని బట్టి గ్రామాలు కూడా రెండే. కన్య మాత్రం వక్కత్తె. ఆమె పేరు నేను చెప్పడానికి శాస్త్రం వప్పుకోదుగాని, వ్రాయడానికి శాస్త్రజ్ఞుల సమయం కొంత అంగీకరిస్తుంది. కాబట్టి వ్రాస్తూన్నాను. ‘సౌందరనందం" అంటారు. వేంకటరత్నం వగయిరా పేర్ల వలెనే యీ పేరున్నూ స్త్రీపరంగా సమర్ధించుకోవచ్చు. యీ పైని చూపిన సూచనల వల్ల యీ పెండ్లి సంగతి యిక్కడి సభ్యుల కందఱికీ స్పష్టంగా తెలిసివుంటుంది. మామగార్లు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావుగార్లనిన్నీ షష్టిపూర్తి మహోత్సవ సందర్భంలో నాకు పై పేరుగల కబ్బాన్ని కృతిపెట్టేరనిన్నీ కూడా తెలిసే వుంటుంది. కాని దీనికి “కంటిన్యుయేషను” గా జరిగిన మనుగుడుపును గూర్చి కొంచెం వ్రాయాలనుకొని వ్రాస్తూన్నాను.

ఈ వివాహం యీ బందరులోనే మీ అందఱి సమక్షంలోనే నాకు అఱవై మూడేండ్ల రెండు మాసాలు నిండేరోజున జరిగింది. కన్యక పుట్టి అప్పటికి కొన్ని వత్సరాలు కాకపోదుగాని, యేమైననూ బాలగాని ప్రోడకాదు కనుక, శారదా బిల్లు కిందకు రాకుండా యీ వివాహాన్ని తప్పించడానికి వీలుండదు, అందులో ముసలాడికి పసిపిల్లని కట్టిపెట్టిన పెండ్లి కనుక, సంఘసంస్కర్తల మనస్సులు యీ పెండ్లిమాట వినడంతోనే మఱీ మండుతాయి. అధికారికూడా పూర్తిగా జుర్మానా అనుగ్రహించడాని కభ్యంతరం వుండదు. యిట్లాటి చిక్కులన్నీ వున్నా నేనీ బందరులో సుమారు పదమూడేళ్లు కాపురంగా వుండి యిక్కడివారి ప్రేమను పూర్తిగా గడించుకొన్న కారణంచేతో మఱేమో కాని, యీ పెళ్లి ఫ్రెంచిపేటలో