పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/702

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

806

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తత్తత్సంస్థానములలో నేకవచన ప్రయోగ మాత్రమున సంతుష్టి నందినట్లును వినుచున్నారము. పంచ రత్నములని పేరువడసిన పదవర్ణములను రచించిన బోగము కొలము విద్వాంసుఁడగు వడివేలునకును నప్పటి తంజాపురీ రాజునకును జరిగిన సంభాషణ మిందులకుదాహరణము, మఱియు నిన్న మొన్నటి వఱకు జీవించియున్న మంగలికొలము సంగీతపండితులు చిన్నన్న కుప్పుసాములలో, చిన్నన్నను మేము బాగుగ నెఱుఁగుదుము. గద్వాలాది సంస్థానములలో, తోడి విద్వాంసులగు నగ్రజాతివారిచేనేమి రాజబంధువులచేనేమి “ఏమి చిన్నన్నా ఏమోయీ చిన్నన్నా" అనిపించుకొనుటయు నెఱుఁగుదుము. ఈ ప్రసంగము నింతటితో నాపుదము. వాండ్రు విద్వాంసులై గారుపదమునకు తగియున్నప్పుడు 'గారు' పద ముపయోగింపకుండుట ప్రాజ్ఞుల లక్షణము కాదు అని మన మేల యనరాదు? అనవలసినదే! ఈయంశమే యిట దేలవలసియున్నది. వినుఁడు ఎంతటినీచుఁడేని విద్యాధిక్యమువలన గారు పదార్హుఁడగుననుట నిక్కమేకాని ఆ నీచున కావిద్య కులవిద్యయగునేని యది గారు పదార్హతనుదప్ప దక్కిన సకలగౌరవములను గలిగించు ననునది యిందలి రహస్యము. ఆనీచుఁ డే యింగ్లీషు విద్యనో చదివి యేయుద్యోగిగనో వచ్చినచో వంగివంగి సలాములు, గారులు, గీరులు, నిరాటంకముగా వచ్చెడిని. స్వకులవిద్యలోఁ బండితుఁ డగువానియందు లోకమున కభిమానమేమో యతిశయించియే యుండును గాని గారుమాత్ర మనుభూతమయి కనుపట్టదు. అగ్రకులజులలో యీబాధలేదు. వాఁడు శుంఠయైనను వారి పూర్వులంబట్టి గారు వాడుచునేయున్నారు. వేశ్యాదిజాతుల పురుషులు గారుపదము సంపాదింపవలెనన్నచోఁ బ్రస్తుతము రాజకీయవిద్యలోఁ నేమాత్రమేని పరిశ్రమ చేయవలసినదే. స్వవిద్యలోఁ జేసిననది గారు పదము నందింపదు. ఇది యనుభవసిద్ధము. పురుషులకు మార్దంగిక శిరోమణిత్వము 'గారు' పదము నందింపఁ గల్గినచో స్త్రీలకు నాట్యనైపుణియో, గానచాతురియో వాత్స్యాయన శాస్త్రపాండితియో, లేక తదనుభవమో గారు పదము నందించి తీరవలయును గదా? అది యెన్నఁటికిని ఘటించునా; సూత్రప్రాయముగ వ్రాసి యీ విషయ మింతతో ముగించుచున్నారము.


★ ★ ★