పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/664

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

768

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ద్రావిడులూ మాత్రమే జీవం నిల్పాలికాని యితరులవల్ల ఆయీ కార్యం తుదనెగ్గదు. కర్ణాటకులూ మహారాష్ట్రులూ వేదం చెప్పుకోవడం మట్టుకు క్వాచిత్కంగా వుందని వినికిడి వుంది. ఘూర్జరులలో చెప్పుకోవడం కూడా దృశ్యాదృశ్యమే. మాగురువుల రోజులలో లోకైకమహావిద్వాంసులు బాలశాస్త్రులవారు యజ్ఞం చేసినప్పుడు శ్రౌతులు మన ఆంధ్రదేశాన్నుంచే ఆహ్వానింపఁబడ్డారని మాపరమగురువుల వల్ల విన్నాను. ఇది విషయాంతరం.

కవిత్వం యావత్కులాలవారిదీగాని వొకకులంవారిది కాదన్నది ప్రధానాంశం. ఆయీమాట వారివారి మాతృభాషకే సమన్వయిస్తుంది. సంస్కృతకవిత్వం ధార వున్నంతలో సాధ్యంకాదు. కాని క్వాచిత్కంగా స్త్రీశూద్రులలో సంస్కృత కవులున్నారని వేశ్య మంజువాణి ఋజువుచేసింది. తెలుఁగులాగే వ్యావహారికంలో దాన్ని నడపడానికి అవకాశంలేదు. అది యావత్తూ గ్రంథాలద్వారా, గురువులద్వారా సంపాదించుకోతగ్గదే కాని వ్యవహారంవల్ల అలవడేది చాలా తక్కువ. మన ఆంధ్రంలో సంస్కృతం కొంత మార్పుచేసి సంస్కృతాన్ని (తత్సమం) కల్పుకుంటున్నాం. కన్నడంలోనో? అఱవంలోనో? లేక ఆరెంటిలోనూ కూడానో? మార్పులేని సంస్కృతాన్ని కలిపి మణిప్రవాళనామంతో వాడుకుంటారనివిన్నాను. శిష్టసమ్మతిలేదు గాని మన భాషలోకూడా కొంచెంగా కనపడుతుంది ఆలాటి కవిత్వం.

శ్లో. తిండికై తె పదిమంది వసంతీ, తండులాలు గృహమందు నసంతి
    రండనాకొడుకులెల్ల హసంతి, కొండగోగులు గృహే విలుఠంతి.

యీరచన చాలా అందంగానే వుంది. అరవకవిత్వానికివలె ప్రాస మాత్రం వుంది. ఆఖరుచరణంలో రెండున్నూ, తక్కిన చరణాలలో వొక్కొకటిన్నీ కేవల సంస్కృతాలున్నాయి. మన భాషలో కూడా యీ మాదిరి రచన వుంటే బాగుంటుందేమో? మణిప్రవాళ నామధేయ (శిష్టులు సమ్మతిస్తే) దీనికే చెల్లుతుంది. కొంటెతనానికి యెవరో చెప్పినవి యీలాటివి మనతెలుఁగులో స్వల్పంగా యింకా వున్నాయి. " - .

శ్లో. అస్థివ ద్బకవచ్చైవ చల్లవ ద్వెల్లకుక్కవత్
    రాజతే భోజతే కీర్తిః పున స్సన్న్యాసిదంతవత్,

శ్లో. ఏకైకదుడ్డుః కులపండితానాం
    దుడ్డుద్వయం కుండలపండితానామ్
    యేగాని యేగాని మహాకవీనాం
    కాసుద్వయం చిల్లర బ్రాహ్మణానాం.