పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

769

కవిత్వ మంటే తన మనస్సులో వున్న భావాన్ని యితరులకు తెల్పుడు చేయడమే కనక యేలాటిభాషలో తెల్పుడు చేస్తే యేమి అనే వాదం యిప్పుడు బయలుదేరింది. క్వాచిత్కంగా పండితులుకూడా దీనికి బాసటగా వుంటూన్నారు. మునుపు (పాండిత్యం లేకపోయిన పక్షంలో) నిశితమైన ధార స్వతస్సిద్ధమైనది వుండిన్నీ యెందఱో దాన్ని వృథాచేసుకోవలసి వచ్చేది. యిప్పుడాలా కాకుండా ఆలాటి ధార కలవారి రచనకు కూడా శిష్టపంక్తిలోకన్నా హెచ్చు పంక్తిలో స్థానం దొరికింది. శ్రీనాథాదుల రోజులలో ద్విపద కావ్యానికే గణన లేనట్టు కనపడుతుంది. కాని సంస్కృతంలో వుండే అనుష్టుప్పునకు తెలుఁగులో సరిపోయేది ద్విపదే అనుకుంటాను. ద్విపదలు, రగడలు వగయిరాలు పదకవిత్వానికి చేరిపోయాయి. పద్యకావ్యాలలో యెక్కడేనా కీర్తన యిమిడిస్తే దాన్ని కవులు ఆక్షేపించేవారు. శ్రీ మాడభూషి వేంకటాచార్యులవారు (అపరపండితరాయలు) పదకవిత్వాన్ని భరతాభ్యుదయంలో వాడే టప్పటికి అల్లంరాజు సుబ్రహ్మణ్యకవిగారు ఆక్షేపించడం నేను నాచిన్నతనంలో యెఱిఁగిందే. పద్యకావ్యాలలో ద్విపద లంతగా వాడడం లేదుగాని ప్రత్యేకించి ద్విపదగానే కొన్ని గ్రంథాలు పూర్వకవులు రచించారు. రంగనాథ రామాయణం వాట్లలో అగ్రస్థాన మలంకరిస్తుంది. శైవకవులు పూర్తిగా ద్విపదలోనే రచన సాగించారు. నన్నయ్యగారినాఁటికి వ్యాపకంగా వున్న అక్కరలు, మధ్యాక్కరలు, తరువోజలు క్రమంగా నామమాత్రావశిష్టాలయినాయి. యిప్పుడు భావకవులు మఱికొన్ని క్రొత్తపేరులు కల్పించికొని వాట్లలో తమభావాలను ప్రకటిస్తూన్నారు. కవిత్వానికి శ్రోతృరంజనం ముఖ్యం. దాన్ని మఱవకుండా రచిస్తే అది “లోకులరసనలె ఆకులుగా" చిరకాలం వుంటుంది. మనకి అచ్చుయంత్రం “నక్కపుట్టి నాల్గువారా లయిందన్నట్లు" నిన్నమొన్నగదా వచ్చింది. అంతకుపూర్వం పుట్టిన మనవారి రచనల జీవాతువులు "లోకులరసనలే" అన్నమాట యేకవిన్నీ మఱవరాదు. తెలుఁగురచన అంతకు పూర్వం వున్నా దాన్ని మంచిత్రోవలో పెట్టి రచన సాగించి మనకింత భిక్ష పెట్టింది నన్నయ్యభట్టు. అతనికి చేదోడువాదోడుగా వున్న మహావిద్వాసుఁడు నారాయణభట్టు ఆంధ్రంలోఁగాని, సంస్కృతంలోఁగాని కన్నడంcగాని యేవో కొన్ని మహా గ్రంథాలు రచియించే వుంటాఁడు కాని అవి యింతవఱకు పైకి రాలేదు. కొందఱు నిన్న మొన్న వ్రాస్తారుకదా- “భారత రచన ఆ నారాయణ భట్టుదే. నన్నయ్య తద్దినం బెట్టేవాఁడి తమ్ముఁడు ... లాగు వుండి వుంటాఁ"డని వ్రాశారు. ఆ యీమాట లోకానికి నచ్చితే సంతోషమే. వారిద్దఱూ కూడా మనకు రక్త సంబంధులుకారు. కవితారచన ద్వారా బంధువులు. “ఘనమతు లెల్లవారికి నకారణబంధులుగారె సత్కవుల్" తెనాలిరామలింగాన్ని విశ్వబ్రాహ్మణులు మావాఁడని అభిమానించినట్లే నేఁడు కొందఱు నన్నయ్య మావాఁడనడమూ కలదు. ఇతణ్ణిగూర్చి