పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

766

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


లోకంలో నిల్వగల్గింది. లేకపోతే గౌడడిండిమభట్టు కంచుఢక్కాకి పట్టిన దుర్గతే దానికిన్నీ పట్టేది.

ఆ కాలంనీకు జోడుకాగడా లెవరిచ్చారంటే "నా ఆముదపుచేనిచ్చిం" దని జవాబిస్తే సహించేది కాదు. అన్నట్టు దేశికులవారు వెంకటేశ్వరస్వామిని బెదరించాక యేం జరిగిందో వ్రాయనే లేదు. యేం జరుగుతుంది? భక్తపరాధీనుఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు దేశికులకు, అనుకూలంగా వర్తించినట్లే వినికిడి. ఆ యీప్రతిజ్ఞలు వగయిరాలుగాని, ఆ యీ భగవత్ర్పత్యక్షాలు గాని యెక్కువ తెలివి కలవారు విశ్వసింపకపోదురు గాక, విశ్వసించేవారే నూటికి తొంభై మంది. వేదాంత దేశికుల ప్రతిజ్ఞాశ్లోకంమళ్లా వొకసారి వుదాహరించి వ్యాసం ముగిస్తాను.

"శ్లో. యతీశ్వరసరస్వతీసురభితాశయానాం సతాం
      వహామి చరణాంబుజం ప్రణతిశాలినా మౌళినా
      తదన్యమతదుర్మద జ్వలిత తేజసాం వాదినాం
      శిరస్సు నిహితం మయా పద మదక్షిణం లక్ష్యతామ్"

యిందులో “అదక్షిణం" అనేపదానికి యెడమకాలనే కాక క్రియా విశేషణంగా వ్యాఖ్యానిస్తే "నిర్దయం” అనే అర్థం కూడా చెప్పవచ్చును. కాని ఆమతస్థులు ఆయీమార్దవాన్ని సహించరో యేమో? యేలా చెప్పినా పాదం శిరస్సు భరించడం తప్పదన్నది సిద్ధాంతమేకదా? సరే; వ్యాసారంభం యెక్కడ? ముగింపెక్కడ? ఉపక్రమోపసంహారాలకు సంబంధబాంధవ్యా లుండవద్దా అంటే వుండవలసిందే కాని అసలు నామార్గం యేదో కొత్తపుంత. దేన్నిగుఱించో మొదలుపెడతాను, మధ్యమధ్య “సర్రాజు పెళ్లిలో గుర్రాజు కొకపోఁచ" లెన్నో జ్ఞప్తికి తగులుతాయి. వాట్లకోసం మళ్లా హెడ్డింగులు పెట్టి వ్రాసేదేమిటని దానిలోనే నాల్గుమాటలు వ్రాసివిడుస్తూ వుంటాను. ఆయీ యావత్తు వ్రాఁతకున్నూసారం

(1) కవిత్వానికీ బ్రాహ్మణ్యానికీ లంకె లేదు.

(2) యేకవిప్రతిజ్ఞలు ఆకవికాలీనులకేకాని తత్పూర్వులకుఁగాని, తదనంతర కాలీనులకుఁగాని సమన్వయింపవు. సమన్వయిస్తాయి అనుకోవడం యుక్తిదూరమే కాక వ్యక్తి దూరమేకాక అనుభవదూరం కూడాను.

ఆయీ రెండు అంశాలున్నూ అవాంతరంగా యింకా కొన్ని దొర్లివుంటే వుండవచ్చును. ముసలివ్రాఁత, నల్లమందు వ్రాఁత యేదో నాకే చేదస్తంగా వుంటుంది. కవిత్వానికీ బ్రాహ్మణ్యానికీ సంబంధం లేదని ప్రాక్కాలీనులు క్షత్రియాదుల వల్లనే తేలింది.