పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/654

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

758

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుపక్రమించినా వాట్లని పెద్దలు - లేదా విజ్ఞులు జవాబివ్వడం (అనగా అలఘు హృదయులతో వాదించడం) అనాలోచనపని. వీరిపెద్దఱికాన్ని ఆవలివారు గమనింపరు. అనరానిమాటలు (బండబూతులు) అందురు. వీరికి అట్టి మాటలు రావు. వస్తాయే అనుకుందాం, అప్పుడు అంతకన్నను వీరు లఘుహృదయులు కావలసి వస్తుంది గదా? అందుచేత అట్టివారి తిట్లను గణించడం ప్రమాదం. వారిచ్చే అథార్టీవాక్యాలు “కుర్వీత బుధసోమయోః" అన్నట్లుంటాయి. అట్టిమాటలను ఖండించడం యెందు కంటాను. వారికి యెవ్వరూ అడ్డరు. బస్ ఇంతే. యేదో ప్రసక్తాను ప్రసక్తంగా యీ విషయం మధ్యలో తగిలింది. -

కవిత్వానికీ, బ్రాహ్మణ్యానికీ లంకె అని అప్పకవి అనలేదు గాని యేదో నీచోపమానం పెట్టి శూద్రకవిత్వాన్ని గూర్చి కొంత ప్రసంగించడం అనాలోచనగానే నాకు కనపడింది. "తెలివి యొకరిసొమ్మా" అన్నాఁడు క్షేత్రయ్య అయితే యితరకులాలలో తెలివి అనే పదార్ధంవున్నా దానిని విద్యలో వుపయోగపఱచక ద్రవ్యాకర్షణకు అనుకూలించే వ్యవసాయాది సద్వృత్తులయందు (నిజం చెవుతాను. నాకు కవిత్వంకంటే వర్తకం కష్టసాధ్యంగా కనపడుతుంది) వినియోగించడంచేత బ్రాహ్మణులలో వున్నంతమందిగాని, కొంత మందిగాని లేకపోవడం తటస్థించింది. చిరకాలాన్నుంచి విద్యాకృషి లేని కుటుంబంలో జన్మించిన వ్యక్తికి విద్యాగోష్ఠిలోకి కాలుపెట్టినప్పుడు బ్రాహ్మణకులజులకుబలె చురుకుగా ఆవాసన అంటదు. అదేనా సంస్కృతమున్నూ, తత్సమపద భూయిష్ఠంగా వుంటే తెలుఁగున్నూ అభ్యసించడంలోనే, ఇంగ్లీషులో బ్రాహ్మలెంతో యితరులూ అంతే. అయినా యీవిషయంలోనూ కొంత విశేషం వున్నట్టు వినికి. దక్షిణాది బ్రాహ్మలవలె మన ఆంధ్రులు కొన్ని పరీక్షలలో వుత్తీర్ణులు కాలేరనీ, దక్షిణదేశస్థులలోనున్నూ తామ్రపర్జీతీరస్థులు మఱీ బుద్ధి సూక్ష్మత కలవారినిన్నీ చెప్పుకుంటారు. దానిక్కారణం ఆ నది వుదకమే అంటారు. ఆ నీటిలో తామ్రంవుందని దానిపేరే చెపుతూవుంది. బ్రాహ్మణులే కాదు. తదితరులుకూడా మిక్కిలి బుద్ధిశాలులు దక్షిణదేశంలో వున్నారు. బ్రాహ్మణేతరులలో అఱవంలో వుడ్డూలమైనకవు లున్నారని వినికి. దక్షిణా గాథకాః అంటే బుద్ధిశాలులు. ఆయీమాట సిద్ధాంతకౌముదిలో వుంది. బహుశః యీమాట భాష్యంలో కూడా వుందేమో జ్ఞాపకం చాలదు. (శా. “లేరే యెందఱో అడ్వొకేట్లు తెలువుల్లేవే; అయంగారికే పేరే మల్లడి కృష్ణసామికె కడు బెంపేమి?" జయంతి చూ.) బుద్ధిమత్తగాని, విద్యావత్తగాని, ధనవత్తగాని, గుణవత్తగాని, ఆవత్తగాని యీవత్తగాని యీవత్తగాని వొకరి సొత్తుగాదు. యిది మాదే అనిన్నీ యితరులు దీనికి తగరనిన్నీ అనుకోవడం, వారిని దూషించడం యివి అనాలోచనపనులు. నాకు మొదటినుంచీ యీ పట్టింపు లేదు. నాకు వచ్చిన నాల్గక్షరాలూ తప్పోవొప్పో బ్రాహ్మణులకేనా