పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

759


సరే బ్రాహ్మణేతరులకేనా సరే చెప్పడమే నాకలవాటు. అప్పకవి రోజుల్లో నేను వుంటే ఆయన నన్ను గాఢంగా మందలించేవాఁడేమో! వేదం నాకు రానూరాదు. వచ్చినకాస్తా నన్నెవరూ అడగనూ లేదు; నేను చెప్పనూ లేదు. శాస్త్రమున్నూ డిటో, యిఁకనల్లా అందఱికీ అందుబాటులో వుండేవి తెలుఁగుముక్కలు. అందులోనేనా వ్యాకరణం యెవరికో (బ్రాహ్మల్లోనూ అంతే) గాని యెక్కదు. అందుచేతే నేను స్కూల్లోకూడా బాల వ్యాకరణం చెప్పేవాణ్ణే కాను. సంవత్సరానికి నాలుగు గడియలకన్న నేను గ్రామరు కింద ఖర్చుపెట్టేవాణ్ణి గాను. నాగ్రామరు యావత్తూ యింతలో యిమిడేది: -

(1) అకారానికిఁ గాని ఇకారానికిఁ గాని సంధి చేయాలని నియమంలేదు - మీచిత్తం.

(2) ఉకారానికి వాక్యం ముగింపులోతప్పక సంధిచేయండి తప్పకుండాను.

(3) ద్రుతతప్రకృతికం (నకారప్పొల్లు) మీఁద వుంటే క చ ట త ప లు; గ జ డ ద బ లుగా మార్చుకోండి.

ఈ మూడు మాటలూ చెప్పడానికి యెన్నాళ్లు కావాలి? కొన్ని నిమిషాలు చాలునుకదా. కాంపోజిషను యావత్తూ వీట్లతోనే నెగ్గించేవాణ్ణి. తెలుఁగుటీచరు వ్యాకరణమే చెప్పడం లేదని యినస్పెక్టరుగారికి యేలా తెలిసిందో (మంథపూడి కామేశ్వరర్రావు పంతులుగారు) నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను “అయ్యా! వ్యాకరణం ప్రత్యేకించి అభ్యసింపవలసిన శాస్త్రం గాని యెన్నో సబ్జెట్లలో అదీవొకటిగా చేర్చి చెప్పతగ్గదిగాదు. కనక నేను ఏదో పరీక్షప్యాసుకు అనుకూలించేమార్గంగా అవసరమైనంతవఱకే బోధిస్తున్నాను. యెంతో క్రోడీకరించి తగ్గించి తగ్గించి చెప్పినా ఆ కాస్తాకూడా అంటనివాళ్లు బోలెడున్నట్లు తమరు చిత్తగించే ఉన్నారు గదా?" అని వారికి తృప్తి కలిగేటట్టు నా అనుభూతిని యేకరు పెట్టిన పిమ్మట వారు ఆమోదించినట్లే నాకు తోఁచింది. యిది యిప్పటికి సుమారు ముప్పది యేళ్లకు పూర్వపు సంగతి. యిటీవల స్కూలుపిల్లల కాంపోజిషనుకున్నూ పత్రికలలోని సంపాదకీయాలు వగయిరాలకూ అంతనిక్కచ్చి వ్యాకరణం అక్కరలేదని అభిప్రాయం మాఱింది. కాలరీతి ప్రతి విషయానికీ లఘుత్వంగా ఉండడాన్ని ఆపేక్షిస్తూ వుంది. గురుత్వాన్ని సహించేటట్టు కనపడదు.

తెలుఁగని పేరుకాని వ్యాకరణం బోధ చేయవలసివస్తే సంస్కృతానికివున్నంత కాకపోయినా కొంతేనా కష్టం వుంటుంది కాని తేలికలో తేలదు. బ్రాహ్మణ కవులు చాలామంది ఆయి కారణంచేతనే వ్యాకరణంమాకు లొంగవలసినదే కాని మేము వ్యాకరణానికి లొంగేదిలేదని శఠిస్తూన్నారు. “ఛందో వ్యాకరణాదివిత్" అని లక్షణం