పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

725


యెన్నివున్నా అనుష్టుప్ఛందస్సుకు సాటివచ్చే ఛందస్సు సంస్కృతంలో లేనేలేదని దాని ప్రాచుర్యాన్ని పట్టే తెలుసుకోవచ్చును. తెలుఁగులో దానికి దీటయినది ద్విపదగానే కనపడుతుంది. రంగనాథుఁడు మొదలైన కవులు కొందఱు ద్విపదనే ఆమోదించి కవిత్వాన్ని నడిపించారు. కాని యేమైనా సంస్కృతంలో అనుష్టుప్ఛందస్సుకు వున్నంత ప్రాచుర్యం దీనికి లేదు. పైఁగా “ద్విపదకావ్యంబు - దిడ్డిగంత" అంటూ తెలుఁగులో యేవగింపుకూడా బయలుదేఱింది. యిది శోచ్యమేకాని పలువురు కవులలోనూటికి వొక్కరూ గౌరవించినవారు కనపడకపోవడంచేత ద్విపద అంతరించిందనే అనుకోవచ్చు. పడమటి దేశంలో ద్విపదరామాయణానికి వున్నంత ప్రచారంలో యెన్నోవంతూ కూడా భాస్కరరామాయణానికి వున్నట్టు లేదు.

“ఉన్నాఁడు తడవుగా నున్నాఁ డతండు
మన్నాఁడు నిన్నుఁ దెమ్మన్నాఁడటన్న"

యీరీతిని యెంతో రమణీయంగా వుండే ద్విపదకవిత్వాన్ని యిటీవలివారు “త్రోసిరా" జనడం విచార్యమే. నిన్న మొన్నటినుంచి కొందఱు గేయానుకూలాలు “ముత్యాలసరాలు" లోనైనవి కొత్తవి కల్పించో యేపాటలలోనోచూచో రచిస్తూన్నవారు వున్నా వారేనా యీద్విపదని పైకి తీసుకురావడంలేదు. యెవరూ దీనికి మొగ్గలేదుగాని మొగ్గేపక్షంలో భారతం యావత్తూ యీద్విపదలో అనువదిస్తే బాగా వుండే దనుకుంటాను. కవిత్రయంవారు పద్యాలలో అనువదిస్తే మళ్లా మనంకూడా పద్యాలలోనే అనువదించడంకంటే ద్విపదలో అనువదిస్తే చాలా నూతనత్వం కనపడి తీరుతుందని నే ననుకున్నాను. నాబోటి వృద్ధుఁడికి యీవూహపుట్టి ప్రయోజనంలేదుగాని యెవరేనా యువకవులకు యీవూహ పుట్టేటట్టయితే ఆవూహ ప్రయోజనకారిగా పరిణమించి ఆంధ్రానికి వకనూతనాలంకారాన్ని సంపాదించ గలుగుతుందనుకుంటాను. ద్విపద కవిత్వంలో శబ్దచిత్రానికి పాటుపడేకవికికూడా అంత విశేషావకాశం వుండదు కనక ఆయీరచన చాలా అనుకూలంగా వుండడమే కాకుండా "సంస్కృతమం గని గేలి" చేస్తుందనికూడా నేననుకుంటాను. శ్లేష, ద్వ్యర్థి, మొదలైనవికూడా శబ్ద చిత్రాలుగానే పరిగణింపబడతాయి. వీట్లని యెంత తగ్గించివాడితే (నల్ల మందులాగ) కవిత్వం అంతరమ్యంగా వుంటుంది. దీన్ని గూర్చి కాళిదాసాదుల కావ్యాలే మనకు ప్రేరకాలు కనక విస్తరించేదిలేదు. నాకూయమకం చేతనవునుసుమా అని చెప్పడానికో అన్నట్టు కాళిదాసు నవమస్సర్గలో “న నగరం నగరంధ్రకరౌజనః" అంటూ యావత్తుసర్గా అదేమాదిరిగా నడిపించాడు. యింకోటి "కవికంఠపాశం’ అంటూ వొకపుస్తకం కనపడుతుంది. అవి శార్దూలశ్లోకాలు. "ఖడ్గీవ త్ఖగరాజవ త్ఖచరవ త్కంఖాణన త్ఖాణవత్"