పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/620

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

724

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గాని యితరాలకు కల్పడం కర్ణకటువుగా వుంటుందని వామనుఁ డభిప్రాయపడ్డాఁడు. దీని కింకా వివరణం వ్రాస్తేకాని సర్వే సర్వత్ర యువకవుల మనస్సుకు బాగా యెక్కదు. కాని దానికి తగ్గశక్తి నాదగ్గిఱ వున్నట్టు లేదు. తన అభిప్రాయాన్ని యితరులకు యెక్కేటట్టు వ్రాయడమంటే సామాన్యంకాదు, ముఖాముఖీని బోధించడం సుఖంగాని వ్రాఁతమూలంగా బోధించడం చాలాకష్టం. అసలు కవిత్వానికి వున్న చిక్కంతా దీనిలోనేవుంది.

అనుబంధం

విషయాన్ని సంగ్రహించి, వ్రాయడానికే సంకల్పించి మొదలు పెట్టినా, వార్ధక్యదోషం చేతో యేమో కొంత యితరవిషయంకూడా దొర్లి ప్రధానాంశం మఱుగుపడిందేమో? అని అనుమానం కలుగుతూ వుంది. కనక మళ్లా కొంచెం వ్రాస్తూన్నాను. లోకాదరాన్ని అపేక్షించే కవికి శబ్దచిత్రం యేమీ సాయం చేయదు. కవిత్వానికి కావలసింది అర్థగాంభీర్యంగాని శబ్దగాంభీర్యంగాదు. ఆయీ గాంభీర్యం పద్యాలలోనే యిముడ్చ నక్కఱలేదు. గద్య కావ్యంలోకూడా యిముడ్చవచ్చును. కాని గానసాహాయ్యం పద్యానికే కాని గద్యకు వుపకరించదు. యింతేకాదు, కంఠోపాఠంచేసి తరించవలసిన విద్యార్ధిలోకానికి గద్యకంటె పద్యం యెక్కువ సహాయకారి, కనక తఱుచు మనకవులు పద్యమయంగానే కవిత్వాన్ని నడిపిస్తూవచ్చారు. వాల్మీకికి పూర్వం గద్యకవిత్వమే కాక పద్యకవిత్వంకూడా కొంత (వేదంలో నన్నమాట) వుండేది గాని అది యెవరో గాని అందఱూ యెఱిఁగింది కాదు. అందఱూ యెఱిఁగిన ఛందోమయవాఙ్మయానికి వాల్మీకే ఆద్యుఁడు. కనకనే “భువిఁగవితాకన్యఁబుట్టించె నెవ్వాఁడు” అనే ప్రతిష్ఠ వాల్మీక్కి దక్కింది. ఆదికవిత్వంగా యావన్మందిపండితులూ కవులూ గౌరవించే రామాయణంలో యిటీవలికవులు వారి వారి కవిత్వాలలో ప్రవేశపెట్టిన శబ్దచిత్రం కనపడదు, యిది ఆవశ్యక మయినదే అని చెప్పఁదగ్గదే అయితే ఆ మహాముని వుపేక్షించేవాఁడు కాఁడు. వాల్మీకిరామాయణంలో,

శ్లో. రామం దశరథంవిద్ధి మాం విద్ధి జనకాత్మజామ్
    అయోధ్యామటవీం విద్ధి గచ్ఛతాత యధాసుఖమ్.

మొదలైన శ్లోకాలకు చెప్పే విశేషార్థాలు యిటీవల వ్యాఖ్యాతల బుద్ధిచే కల్పించఁబడ్డవేకాని కవి యెఱిఁగి వున్నవి కావు. అందుచేత అట్టి క్లిష్టమార్గాలు తొక్కిన కవిత్వం ఆదరణపాత్రంకాదు. భారతంలో కొన్నిక్లిష్టమార్గాలు కనపడతాయి. అవిమాత్రం గ్రంథకర్త యెఱిఁగినవే అని వొప్పుకోక తప్పదు. దానికి శిష్టపరంపరాగతమైన యితిహాసం (విఘ్నేశ్వరునివ్రాఁతకు సంబంధించింది) ప్రోద్బలంగా కనపడుతుంది. ఛందస్సులు