పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

726

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యీమాదిరి (అర్థశూన్యపు) చతుర్థపాదాలతోనే వుంటాయి ఆశ్లోకాలు. అర్థం లేనివే అని తోస్తుంది. లేకపోయినా నిఘంట్లు దగ్గిఱపెట్టుకొని యెవరేనా చెపితే చెపుతారేమో? చెప్పనివ్వండిగాని అది కాళిదాసుగారి కవిత్వం మాత్రం కాదు. కాళిదాసాదులు తగినంత సామగ్రి వున్నవాళ్లవడంచేత వాళ్లు యమకం నడిపించినా కొంత రసం కనపడుతుంది. యితరుల కవిత్వానికి యీభాగ్యం పట్టదు. మేముచెప్పిన “కాళికాస్తవాన్ని" మెచ్చుకొనే పండితులను చూచినప్పుడు నాకు సిగ్గుగలిగేది. కాళిదాసుగారి "ద్వైపాయన ప్రభృతి" శ్లోకాలకున్నూ మా “నాళీకజాద్యదితి" శ్లోకాలకున్నూ పోలికేలేదు. అయితే యేమి, మావాట్లకీ పేరువచ్చింది ("పుణ్యైర్యశో లభ్యతే" “అనప్పిండి అమ్మన్నగారిదీ బట్టతల నామొగుడిదీ బట్టతల”) కాఁబట్టి పండితులలో కూడా కవిత్వతత్త్వాన్ని నిర్ణయించే వారు తక్కువగానే వుంటారన్నది నిష్కృష్టాంశం.

“కోవేత్తి కవితాతత్త్వ మీశ్వరో వేత్తివా నవా”

★ ★ ★