పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

720

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యీమాదిరి పద్యాలవల్లనే పోతరాజుగారిపేరు కవిమండలంలో సువర్ణాక్షరాలతో శాశ్వతమయిందని సర్వులూ (సహృదయత్వం వున్నవారౌతేనే) అంగీకరిస్తారు. భాగవతం అంతా పరిశీలిస్తే (పోతరాజుగారి కవిత్వభాగంలోనే అనుకోండి) యిలాటి పద్యాలు మహావుంటే ఒక శతమానానికి మించవనుకుంటాను. తావన్మాత్రంతోనే లోకోత్తరమైన పేరు ప్రతిష్ఠలు పోతరాజుగారికి వచ్చేశాయి.

ఆ.వె. ఆఢ్యుఁడొక్కఁడున్న నందఱు పూజ్యులే
       లెక్కమీఁద సున్న లెక్కినట్లు
       అతఁడువోవుమీఁద నంద ఱపూజ్యులే
       సున్నమీఁద సున్న లున్నయట్లు.

యీ మధ్యకాలంలో యువకవులున్నూ బాలకవులున్నూ కొత్తపంథాగా కవిత్వాన్ని నడిపిస్తున్నారు. వారు శబ్దవైచిత్రికోసం పాకులాడడం లేదు. అంతేకాదు, యే రసాన్ని పురస్కరించుకొని రచన కారంభిస్తారో దాన్ని పోషించే విభావానుభావాదులలో చాలాభాగం వదులుకొంటూవున్నారు. అంటే యేమన్నమాట? ఒక్కవిభావాన్నే రంగస్థలాని కెక్కించి కొన్ని మాటలు అవేనా యేలాటివంటారు? పారిభాషికాలు గుదిగూర్చి లోకంమీఁదకి వదులుతున్నారు. అసలువారి సహవాసం వుంటేతప్ప ఆ పారిభాషికాలకు పామరులకేకాదు పండితులకున్నూ అర్థమేకాదు. తాత్పర్యమున్నూ తెలియడంలేదు. అసలు ప్రధానానికి యెన్నో బురఖాలు అలంకరించి రంగానికెక్కిస్తే తప్ప తావన్మాత్రాన్నే బయటపెట్టడం జరిగితే అది సహృదయరంజకం కాకపోఁగా అంతతో శాంతించక పరమాసహ్యాన్ని కూడా కలిగిస్తుందని లోకానికి బోధించే విధానం యేలాటిమాటలతో వ్రాయాలో నాకు బోధపడక యేలాగో యీచివరిమాటలు వ్రాశాను. యింతకన్నా స్పష్టంగా వ్రాసేయెడల ఆయా కవులకవిత్వంమాట ఆలా వుండంగా నేను వ్రాసినవ్రాఁతే అసహ్యంగా వుంటుందని భయపడ్డాను. కవి తెచ్చిపెట్టే సొగసే కాని అసలులో వున్న దేముంది? "పుట్టమృత్తిక".

శ్లో. స్తనౌ మాంసగ్రంథీ కనకకలశా విత్యుపమితౌ
    ముఖం శ్లేష్మాగారం తదపిచ శశాంకేన తులితమ్
    స్రవన్మూత్రక్లిన్నం కరిక రశిరస్పర్ధి జఘనం
    ముహు ర్నింద్యం రూపం కవిజనవిశేషైర్గురుకృతమ్.

యీ శ్లోకంలో తక్కినదంతా మనకొద్దు నాలుగో చరణంలోవున్న అంశాన్నే మనం తీసుకోవాలి. కవిపోషణ చేయడంలోనే నాయికానాయకుల అందచందాలుగాని, శీలంవగయిరాలుగాని వన్నె కెక్కి సహృదయులను ఆకర్షించాలి. అట్టిస్థితిలో ఆ పోషణ