పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/615

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

719

యీలా నిద్దరోతూ వుంటే యేం బాగుంటుంది అనేవారే లోకంలో సర్వత్రా (పామరులలో కాదు మహాపండితులలోనే) కనపడతారు. యీ విషయంలో అనుభవాన్నిబట్టి వొకమాట వ్రాస్తాను. పండితులకంటేకూడా పామరులలోనే (సామాన్యులలోనే అన్నమాట) రసజ్ఞు లుంటారని కనిపెట్టఁగలిగాను. ఆకనిపెట్టడాన్ని బట్టియ్యేవే సుమారు యిప్పటికి నలభైయేళ్లక్రితము యీ క్రింది విధంగా వ్రాయవలసివచ్చింది.

“... ... కేవలు లెందఱునేని కావ్యకృ
ద్భావము నిర్ణయించి రసపాక మెఱింగి సుఖించి మించి వ
హ్వా వహవా! యటంచు ముదమందఁగ నేరరు, కొద్దికొద్ది ఆ
యా విషయమ్ములన్నియును నారసి లౌకికచాతురీమతి
శ్రీవిభవమ్మునం జెలఁగి చేటున కాకరమౌ నసూయకున్
భావము లొంగనీ కనుభవమ్మున మించిన మిమ్ముబోటి వి
ద్యావిదులౌ రసజ్ఞులకుఁ దద్రసముల్ పొడకట్టు! గాళిదా
సే వచియించెఁగాదె... ... ..."

చాలును. యీ మాలిక యావత్తూ యీవిషయాన్నే బోధిస్తుంది. మొత్తంమీఁద మాటేమిటంటే; యేకవికేనా లోకంలో పెద్దపేరు రావలసివస్తే దానిక్కారణం అతనికవిత్వమందు వుండే శబ్దాడంబర మని మాత్రం అనుకోకూడదు. పోతరాజుగారు తఱుచుగా అంత్య నియమాన్ని మన్నిస్తూవుంటారు.

ఉ. స్వస్తి జగత్త్రయీభవన శాసనకర్తకు హాసమాత్రవి
    ధ్వస్తనిలింపభర్తకు నుదారపదవ్యవహర్తకున్ మునీం
    ద్రస్తుతమంగళాధ్వర వితానవిహర్తకు నిర్జరీగళ
    న్యస్తసువర్ణసూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్.

ఆయీ పద్యం లోకోత్తరమైనధారలోనే వున్నా ఆయనకు పేరు తెచ్చినపద్యాలలో యిది చేరవలసి వుండదు. ఆ పద్యాలలో శబ్దవైచిత్ర్యం మచ్చుకు కూడా వుండదు.

ఉ. నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసమ్ము పైఁ
    జల్లెడివాఁడు మౌళిపరిసర్పితపింఛమువాఁడు నవ్వురా
    జిల్లు మొగమ్మువాఁడొకఁడు చెల్వలమానధనమ్ముఁ దెచ్చెనో
    మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ చెప్పరే?