పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

721


మేమీ లేకుండా “యూస్లేసు” అంటూ "త్రోసిరాజని” ప్రధానభాగాన్ని మాత్రం రంగాని కెక్కిస్తే (అడుగుతారూ? యిఁక అహో! స్వామిరూపమడగనా,) అదిసహృదయాకర్షక మవుతుందని నాకు విశ్వాసం కలగడంలేదు. నేను యీ కొత్తరకం కవిత్వాలు కొన్ని శ్రద్ధగా చదివే అవి అయోమయంగా తోఁచి యీ మాట వ్రాశాను. అందుచేత విభావానుభావాదులు పరిమితంగా (చేదస్తంలేకుండా) వర్ణిస్తూ ప్రధానభాగాన్ని పోషించవలసిందనే నే నభిప్రాయపడతాను. యమకాదులుకూడా యేకొంచెమో కనపఱచడం తప్పుగాదు గాని, వాట్లకే ప్రాధాన్యం యిస్తే మాత్రం ఆ కావ్యం పయికి రాదు, రానే రాదు. వసుచరిత్రలో యెన్నోభాగాలు చేదస్తంగా వున్నవివున్నా ఆచేదస్తాన్ని అధఃకరించతగ్గ కవిత్వభాగాలు కూడా విస్తరించి వుండడంచేతనే ఆకవిత్వం సహృదయ హృదయాహ్లాదకం కావలసివచ్చింది.

సీ. మందయానము నేర్పు నిందిందిరాజీవ
              రాజీవరాజ న్మరాళరాజి.

యిందులో వున్న ముఖ్యమైన అర్థం ఆ గిరికాదేవికి హంసలు నడకలు నేర్పుతూ వున్నాయనేది. బాగాలోతుగాపోతే గిరిక నడక మనోహరంగా వుంటుందనియ్యేవే. ఆసందర్భాన్ని యెంతో సొగసుగా కవి పోషించాcడు. దాన్ని వున్నదున్నట్టే వ్రాసి వూరుకుంటే అదికవిత్వం అనిపించుకోదు, కాని పయిత్య మనిపించుకుంటుంది. యిప్పటి యువకవు లీమాట విశ్వసించరు, తత్తధాస్తామ్. యమకాన్ని ఋతువర్ణనంలోనో అరణ్యసముద్రాది వర్ణనంలోనో వాడి, తనపాండిత్యం చూపించుకుంటే బాగుంటుందని భారవిమహాకవిరచన తెల్పుతూ వుంది. భారవి పంచమస్సర్గ చూడండి. ఆసర్గ యావత్తూ హిమవత్పర్వతాన్నో మఱోపర్వతాన్నో వర్ణించినదే. కాళిదాసు కుమారసంభవంలో ప్రథమస్సర్గలో పర్వతాన్ని వర్ణిస్తూకూడా యమకచిత్రకవిత్వాలతో వర్ణించలేదు. దీన్నిబట్టి యీరీతికవిత్వాలు రసస్ఫోరకాలు కావన్నమాట స్పష్టంగా తేలుతుంది. దీన్నిబట్టి చూస్తే యెక్కడాకూడా ఆకవిత్వం ఆతఁడొప్పుకోఁడని స్పష్టం. చతుర్విధ కవిత్వాలతోటీ నింపినకావ్యాలలోనేనా చివరకు పేరు తెచ్చేవి భావప్రధానంగా చెప్పినపద్యాలే అవుతాయి కాని యితరంకావు. అబ్బాయీ! వసుచరిత్రలో దేదేనా వొకపద్యం చదవవలసిందని యెవరేనా పృచ్చచేస్తే ఆవిద్యార్థి రసారసవివేచనకలవాఁడే అయితే,

శ్లో. ఆపద్మోద్భవునోలగంబునకు దీవ్యద్ద్వీపినుల్ నిచ్చరా
    రో? పోరో? మఱి యెందఱేనియును వారున్ మేము సంధింపమో!
    యేపద్మాననఁ జూచినన్ జెలియ! ని న్నీక్షించినట్లుండ దే
    లా! పల్మాటలు పూర్వజన్మకృతముల్ గాఁబోలు నీ నెయ్యముల్