పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/602

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

706

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కర్నాట కలహం. భవతు, దానికేమి ఆగేయకర్తకు అది లోకోత్తరమైన కవిత్వంగా తోఁచినట్టే నాకు దానికి విపరీతంగానూ తోఁచింది. నే నేం చేసేది? నాకు తోఁచింది వ్రాశాను. "లోకోభిన్నరుచిః" దీనికి వివాదమెందుకు? వివాదపడి సాధించతగ్గ విషయ మిదికాదుగదా! యిది మాత్రమేనా! పచనం కూడా యిట్టిదే. యెన్ని పాకశాస్త్ర శ్లోకాలు యేకరు పెట్టినా భోక్త నాలుక కవి రుచిని కలిగింప నేరవని వ్రాయనక్కఱలేదు. (పచనకర్త "నీకు నాపాకాన్ని అనుభవించే నేర్పులేదు" అని గాని- "నీకు జిహ్వదోషం పట్టిం"దని కాని-పైత్యరోగమ్ము చేతను-చూ.) అంటే అనవచ్చును. కాని అట్టి ధార్‌ష్ట్యమును చూపినవారు మాత్రం యింతవఱకు పాచకులందు వున్నట్లు వినలేదు. నా మతంలో (1) కవి, (2) గాయకుఁడు, (3) పాచకుఁడు, (4) కన్యాపిత యీ నలుగురూ వొకటే తరగతివారనిన్నీ వీరు నిర్బంధించి యితరుల సర్టిఫికెట్లు సంపాదించడానికి ప్రయత్నించి ప్రయోజనం లేదనిన్నీఆ కారణంచేత వుదాసీనులుగా వుండి యితరులు తమకు యిచ్చే సలహాలు రుచిస్తే అనుసరిస్తూ, రుచించకపోతే వుపేక్షిస్తూ వుండడమే యుక్తమనిన్నీ తోస్తుంది-అంతేనేకాని - "నీవు నా కవిత్వం మెచ్చుకోలేదు కనక నీవు నాకు ద్వేష్యుఁడవు" అనడంలో ప్రయోజనంలేదు. నేను మొదటినుంచీ ద్వేషం లేదని వ్రాస్తూన్నాను. నాకు "మాదాకవళం" కవిత్వమేకాదు. నేఁటివెన్నో నచ్చడంలేదు. (ద్వైతానికి అద్వైతం నచ్చదు - దానికి యిది నచ్చదు) అంత మాత్రంచేత వారు నాకుద్వేష్యులా? కారు, యిది నాచేదస్తమైనా కావచ్చు. నాశ్రవణానందాన్ని నేను సమర్థించేదిలేదు. అట్లే “మాదాకవళాన్నిన్నీ" వుపేక్షిస్తే వీలేమో? లోకానికి వదలిపెడదాం యెందుకీశ్రమ-

స్వస్తి.

★ ★ ★