పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/576

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

580

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చెప్పేమాట) త్వరలో నన్ను తమ గ్రామానికి వెంటఁబెట్టుకొని వెళ్లి మీరు వ్రాసిన వ్రాఁతలో (గోడమీద పిల్లివాటంగా వున్నదానిలో) యేసమ్మానం మీమనస్సా వివక్షితమో? దాన్నేచేయండి. పిమ్మట నేను నాతోకూడా నా స్వంత ఖర్చుల మీఁద మిమ్మల్ని తీసుకువచ్చి నాఆహ్వానంలో (యేవిధమైన యితరార్థములేదు. గనుక) వున్న నిష్కపటమైన సేల్జోడు బహుమానం చేసి తరిస్తాను. ఆమర్నాటినుంచి మళ్లా నా “శివాయనమ ఓం” లోకి దిగుతాను. "ఆలస్యాదమృతం విషమ్" కనుక జనవరినెల లేక ఫిబ్రవరి 15 తేదీకిలోఁగా యీ ప్రయత్నం చేయండి. యింతే పెద్దలగు మీకు నా నమస్కారాలు "శివాయనమ ఓం, శివాయనమ ఓం! శివాయనమ ఓం శివాయనమ ఓం" స్వస్తి.

అనుబంధము

నేను లోఁగడ సంవత్సరం నాఁడు వ్రాసిన “నన్నయ్యభట్టు" వ్యాసంలో ప్రసక్తాను ప్రసక్తంగా భారతం నన్నయ్యగారి చేతిమీదుగాఁ పూర్తికాకపోవడానికి సూచ్యార్థ సూచన నన్నయ్యగారి వాణి-

"చ. అమలిన తారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా
     స్త్రముల యశేషపారము ముదంబునఁ బొందను బుద్ధి బాహువి
     క్రమమున దుర్గమార్థజల గౌరవభారత భారతీసము
     ద్రము దరియంగ నీఁదను విధాతృనకైనను నేరఁ బోలునే?"

అనే పద్యంలోనే సూచించిందని క్లుప్తంగా సూచించినాను. దాన్ని మావిమర్శకుఁడు గారు అపవదిస్తూ కొన్ని మాటలు వ్రాయుటయేకాక యెవరో చౌదరిగారివద్దనూ యింకా యెవరో బ్రాహ్మణపిల్లవానివద్దనూయేవో యుక్తులు చెప్పి ముఖపిధానం చేయడానికి ఆరంభిస్తే వారిద్దఱున్నూ నాపేర తఱుచుగా ఉత్తరాలు వ్రాస్తూన్నారు. వారి వ్రాఁత కొంత “శల్యసారథ్య" ప్రయుక్తంగానే కనపడుతుంది గాని అయినప్పటికీ ఆసంశయాన్ని మనస్సులో పెట్టుకోక నేను-

“అయ్యా! వ్రాస్తే చాలా వ్రాయాలి. కాఁబట్టి వొకసారి మా వూరు వస్తే నాకు తెలిసినంతలో మీ సంశయం తీరుస్తాను.”

అని వ్రాసి వున్నాను. కాని వారిలో వొకరు (చౌదరిగారు) నావలెనే వృద్దులఁట! అందుచేత రాలేక మళ్లా మళ్లా వుత్తరాలు వ్రాసి నాకు పనికలిగిస్తూన్నారు. అందుచేత యీ రెండు మాటలున్నూ వ్రాస్తే యిది వారికే కాక తద్ద్వారాగా "దేహళీదత్తదీపన్యాయం"గా యితర పాఠకలో కానిక్కూడా అందించినట్లగు నని పైని వుదాహరించిన పద్యంలో వున్న