పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/570

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

574

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నాదేమేనా తప్పున్నట్టు వారికి తోస్తే నన్నుకూడా ఆధూళిపూడి ధూళిరేఁగేటట్టు మందలించడానికి పూర్ణమైన అధికారం కలిగి వుందని వేఱే వ్రాయనక్కఱలేదు. యీయన మా “పాణిగృహీత" గ్రంథం కృతి యివ్వడాన్ని గూర్చి కొన్నిశంకలు చేసి వున్నారు. వాట్లను గూర్చి వ్రాయవలసివస్తే బోలెఁడు చరిత్ర వుంది. అది సుమారు 35 సంవత్సరాలఁనాటి చరిత్ర. ప్రస్తుతం యెంతో ప్రయత్నిస్తేనేగాని మొట్టమొదట ఆవుత్తరాలు వగైరా ప్రచురించిన ఆపుస్తకం కూడా చిక్కదు. సరే? యేలాగో సంపాదిస్తానే అనుకోండి. ప్రచురిస్తానే అనుకోండి. దానివల్ల యేప్రయోజనాన్ని సాధించినట్టయింది. విమర్శకుఁడుగారిని సమాధాన పఱచడంకంటే యింకేం ప్రయోజన మంటారా? ఆయన తలలో సత్యం వప్పుకొనే రేణువులంటూ వుంటేనా? ఆబాపతురేణువులు యేవొకటి రెండు వున్నప్పటికీ గుంటూరిసీమలోవున్న ఆయా వుత్తరాలనుగూర్చియేమి యితర విషయాలనుగూర్చి యేమి శంకించవలసి వుండదు. లేదా శ్రీకొప్పరపు సోదరుల స్వహస్తలిఖితానికి మక్కికి మక్కి నకలును మేము ప్రచురించడం; వారుమాకు డాబుదర్పంగా రిజిస్టరు నోటీసు యివ్వడం; మళ్లామేము జబాబు యివ్వడం; దానితో - "నిమ్మకునీరెత్తినట్లు" వారు కిక్కురుమనకుండా తూష్ణీంభావం వహించి గత్యంతరం లేక వూరుకుండడం; అంతా గుంటూరుసీమ ఉత్తరరంగంలో ప్రచురింపఁబడి వుండఁగా దాన్ని గూర్చి అసలు వారు యెన్నఁటికీ మాట్లాడడానికి అవకాశంలేక వారి ప్రమాదాన్ని వారు న్యాయంగా వప్పుకోవడంచేత లోకుల గౌరవానికి భాజనులుకాఁగా యిప్పడీవిమర్శకుడుగారు దానికోసం పెనుగులాడడమనేది - "గుంజ లార్చాయి" అనే సామెతను జ్ఞప్తికి తెస్తూ వుందో? లేదో? పరిశీలించండి నాయనలారా! అప్పుడు - "పచ్చగడ్డి వేస్తే భగ్గునమండుతూ" వుండే రోజులు గదా? వారికీ మాకూ? యేమాత్రం అవకాశం వున్నా సోదరులుగాని వారిపార్టీ వారుగాని ఆకాలంలో వుండేశాఖాభిమానంగాని వూరుకోనిచ్చేదేనా? అసలువుత్తరమే వొకవైదిక స్కూలు మాస్టరుకి చేజిక్కింది. అసలు అతనివద్దవుంచుకొన్నాడు. నకలు వ్రాసియిచ్చాఁడు, పని పడితే అసలుతో హాజరు గావడానికి సిద్ధంగా వున్నానని అసలు దాన్ని చూపించాఁడు, దాని మీఁద దాన్ని మేము ప్రచురించఁగలిగాము. ఆరికార్దంతా యిప్పటికింకా జాగ్రత్త పెట్టే వుంచాను. యేమో? యెప్పటి కేం పని పడుతుందో? అని“కోకాలః (కః కాలః అనరు) కోధర్మః" అంటారు కదా? అభియుక్తులు. చెప్పొచ్చే దేమంటే? విమర్శకుఁడుగారు ముప్పైయేళ్లకి మళ్లా అదంతా ప్రచురింపచేసే పనికికదా? అంకురార్పణచేశారు. (ఈశంకా సమాధానాలకూ పాండిత్యానికీ సంబంధబాంధవ్యాలేమేనా వున్నాయా? లేవు. అయితే దీనివల్ల జరిగే లోకోపకారం యేమి? అంటే, సమాధానం సున్నకదా?) అది నాకు ఆశ్చర్యంగా కనపడి ఆసీమవారికి బరాతం చెప్పివున్నాను. సోదరులు