పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

573


విషయమై చర్చించడం అనవసరం. ఆ భారతం విమర్శకుఁడే చూచి లేదంటే తప్ప యీలోఁగా నేను దాన్ని వెతకడానికి ప్రయత్నించేదిలేదు. పోవూరి వేంకటేశ్వర్లుగారిచేత విమర్శకుఁడుగారు వ్రాయించిన వుత్తరాలకు నేను "లోకమో? పాడో" అనుకొని యథాలాభంగా, అశ్రద్ధగా యిచ్చిన మొట్టమొదటి జవాబువల్ల విమర్శకుఁడుగారికి బాగాలోఁకువ చిక్కి-వీఁడు తామనుకొన్న అసకృదావృత్తిగా విమర్శన గ్రంథంలో వాడుకున్న “ముత్తైదువు" లాగ వూరుకునే వాఁడేఅని ధీమాకు చిక్కి లోఁకువకట్టి ఆపుస్తకం పాఁతరలోనుంచి బైటికితీసి తిట్లూ, ద్రావిడస్త్రీల కుచాలు వగైరాదుష్ప్రసంగంతోటే “ఐసరుబొజ్జా" అని ధైర్యంగా, నిర్లక్ష్యంగా భవిష్యదాలోచన లేక విమర్శన గ్రంథం (స్వంతద్రవ్యంతోనే పాపం?) అచ్చొత్తించుకొన్నారు. దానికీకూడా నేను అజ్ఞాన ప్రయుక్తమైన వనిగదా? అనివోపికలేని రోజుల్లో యెందుకీయనతో వాదం పెట్టుకోవడమని యేదో ప్రసక్తిలేని ప్రసక్తిగా “నన్నయ్యభట్టును" గూర్చి వ్రాయడం పెట్టుకుని విమర్శకుఁడిగారి శంకలలో వున్న అసారస్యాన్ని దిజ్మాత్రం చూపి, తిట్లనుచూపి అవి కూడా గణింపక సేల్జోడు బహుమానంద్వారా గౌరవిద్దా మనుకుంటే అది అంగీకరించలే. ఉహూ పైఁగా నాకే సమ్మానం. అంతతోటీ వుపరమించలే. నాశంకల కన్నిటికి జవాబివ్వలే దంటూ వొకనెపం. ప్రతీశంకా యేదో కొంత చరిత్రను పురస్కరించుకొన్నదే. యిప్పటికి ముఫ్పై యేళ్లనాఁటి చరిత్ర కొన్నిటికి వ్రాయాలి. యాభైయేళ్లనాఁటి చరిత్ర కొన్నిటికి వ్రాయాలి. యెంత కుంచించి వ్రాసినా తీఁగదీస్తే దొంక కదలినట్లవుతుందాయె. అక్కడికీ మచ్చుకు మీసాన్నిగూర్చి వ్రాసి చూపిస్తినాయె. ఆయువుపట్టుశంక నన్నయ్యభట్టును గూర్చి లోఁగడ వ్యాసంలోనేకాక మళ్లా యీవ్యాసములో పోతరాజుగారి-

“మ. ఒనర న్నన్నయ తిక్కనాదికవు లీయుర్విం బురాణావళుల్ తెనుఁగుంజేసియు”

అన్నపద్యం కూడా వుదాహరించి చూపడం అవుతూవుందా? యీవ్యాసంలో యింతతోటేనా కిక్కురుమన కుండా స్వయంకృతాపరాధానికి (అంటే యీలాటిశంకలకు కాదు. పదియవ నాఁటివగైరాతిట్లకే లజ్జిస్తూ యిట్టి అపమార్గంలోకి దింపిన విపరీత దైవానికి చింతిస్తూ నాసేల్జోడు బహుమానాన్ని స్వీకరించి (వయస్సుచే) పెద్దలు కనుక నన్ను యీలాగే యెవరేనా తలతిక్క ప్రశ్నలు వేస్తూవుంటే జవాబు యిస్తూ శేష జీవితాన్ని గడుపుకోవలసిందని ఆశీర్వదించి తలదాఁచుకోవడమేయుక్తమో? “నాశంకల కింకా సమాధానం రానేలేదు" అంటూ "కిందఁబడ్డా మీఁదివాణ్ణే" అంటూ పరాక్రమించడానికి తలెత్తబోవడమే యుక్తమో? లోకంమాటకేంగాని ఆధూళిపూడిలో చాలామంది ఆంగ్లభాషా విశారదులున్నట్లు నే విన్నమాట నిజమే. అయితే వారే మందలిస్తారని నా ఆశ. యిందులో