పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

549


తామొనర్చిన అపచారాలవల్ల రావడానికి మొగం చెల్లక ఆ బహుమానం అక్కడకే మూటగట్టి తెచ్చి చేయవలసిందంటారే! యిది యెక్కడి లోకజ్ఞానం బాబూ? ఏమో? అలాఅనడానికిన్నీ వల్లకాదు; “కవితాలలన మొగంబు బూడిదం బులిమే" వాళ్లకు దానిలోవున్న సారస్యం బోధపడుతుందా! ఏదో మాదిరి "ముతైదువు" కదా! వాఁడు కృతిభర్త సేల్జోడు పట్టుకొని అత్తవారింటికే (స్వంత ఖర్చులతో కూడా కాబోలును) వెళ్లి కృతికన్యాప్రదాతను సమ్మానించడం యెట్టిదో? ధూళిపూడి గ్రామమే తెలుసుకొనుcగాక. ఆ భారం దానిదే నాకెందుకు - యిఁక. “ఏ భూపాలుc డీవచ్చినన్” అన్నసాఁకును గూర్చి విచారిద్దాం. తృతీయ చరణంలో వున్న- “సాలగ్రామము మున్నుఁగా గొనఁడు” అన్నది బాధిస్తుంది కాఁబోలు స్పృశించనే లేదు. ఆసాలగ్రామ పదంవల్ల కాళ్లుకడిగి మంత్రపూర్వం యిచ్చే షోడశమహాదానాలు గాని, దశదానాలుగాని (అనఁగా పురోహితవృత్తిలో వుండేవారు పరిగ్రహించే వన్నమాట) ప్రవరాఖ్యుఁడు న ప్రతిగ్రహీత కనక పరిగ్రహించడనే స్వారస్యమే వస్తుందిగాని, పాండిత్యప్రయుక్తమైన సన్మానాలుకూడా అతఁడు పరిగ్రహించక నిరాకరిస్తాఁడని స్ఫురించదు. స్పృశించక వదిలినా ఆసాలగ్రామం "ఎట్‌సెట్రా" న్యాయంచేత వచ్చితీరుతుంది. పెద్దనామాత్య ప్రభృతి మహాకవులు అగ్రహారాదులు రాజులవల్ల సగౌరవముగా స్వీకరించేవున్నారుగాని నిరాకరించలేదు (కోకటగ్రామాద్యనే కాగ్రహారంబు లడిగిన సీమల యందునిచ్చె). కాఁబట్టి మన అభినవతిక్కయజ్వగారు నాయిచ్చుసేల్జోడు బహుమానాన్ని నిరాకరించడానికి ఆసాఁకు బొత్తిగా యేమీ ఉపకరింపనందున- మొగం చెల్లకపోవడమే యిందుక్కారణమని తప్పక యొప్పికోవలసి వస్తూవుంది. యీవూహ నిక్కమే అయితే యిప్పటికేనా "పశ్చాత్తాపానికి" వచ్చినట్టు ప్రాజ్ఞలోకం భావించడమే కాకుండా పశ్చాత్తాపం పాపనివారకంకాఁబట్టి పారలౌకికపు చిక్కు కూడా వారికి లేదని తోస్తుంది. నాకు వయస్సు ఉత్తరవయస్సు కనక ఐహికభయం కంటె పారమార్థిక భయమే యెక్కువగా చూచుకోవలసి వుంటుందని వేఱుగా చెప్పనక్కఱలేదు. “శా. నాకుం దోఁచినమాట యైహికమటన్నన్ దీర్ఘ యాత్రాపరుల్, వీఁకంజేయు మకాము లందొకటియౌ వేయేళ్లు జీవించినన్." మఱేమీ ఆశ్చర్యంగా కనపడదుగానీ, యే పైలాపచ్చీసు వయస్సులో నేనావున్నవారైతే యీలాటి తిట్లుతిట్టి ప్రచురించారన్నా కొంత అంగీకరించడానికి మనస్సు వొప్పుకుంటుందిగాని యీలాటి పెద్దలు, భారతాది గ్రంథపరిశీలకులు, విమర్శకులు, లౌకికసార్వభౌములు పైఁగా అంతో యింతో కవులున్నూ గదా? వీరు! వీరు“పదియవనాఁటి" మొదలైన తిట్లు మమ్మల్ని కాదే అనుకుందాం వేఱొకరినేనా యెంత నికృష్టుణ్ణేనాతిట్టి ప్రచురించి (వారు కోర్టుకు మాలాగే వెళ్లరే అనుకోండి) మళ్లా లోకంలో యెలా తలెత్తుకు తిరగడానికి వల్లపడుతుంద దనుకున్నారో అనేదే పెద్ద సందేహం.