పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

550

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మాశిష్యకోటిలో వ్యక్తులిద్దరు యీమధ్య నేను బెజవాడ వెళ్లినప్పుడు “యీలాటివారి కందఱికీ మీరుజవాబు చెపుతూ వుండడం మీది పెద్దలోపం" అంటూ నన్నుమందలించడానికి మొదలుపెట్టారు. దానిమీద-

"నాయనా! ఆయనమీకు దగ్గఱ బంధువులు కాకపోయినా శాఖా మాత్రబంధువులు కాకపోరుగదా? నాకుపనిలేకుండా పోతుంది. కాస్త కలిగించుకొని మంచి మార్గానికి తిప్పండి అని ఆ యిద్దఱిలో వకరితో మాత్రము అని చూచాను. కానీ అతనికి యెల్లప్పుడూ ఆ కాంగ్రెస్సు వర్కుతోటే సరిపోవడం చేతనో యేమో? మళ్లా యీప్రసక్తి యెత్తుకోనేలేదు. లేకపోతే వుపేక్షించేవాఁడు కాఁడు. గుంటూరుసీమ వివాదల పుట్టుపూర్వోత్తరం పూర్తిగా యెఱిఁగి అయ్యో! అని నొచ్చికొనే వాళ్లల్లో మొట్టమొదటివాఁడే, "ఉ. శాఖకు నప్రతిష్ఠ" యీలాటి వృథా అభిమానం అని చింతించేవాఁడే. అయినా -

"నమాజు చేయఁబోతే మసీదు మెడ బడ్డది" అన్నట్టున్న యీవ్యర్థ వ్యాపారంలోకి యెవఁడో నావంటి చేదస్తుడుతప్ప యెవఁడు కలిగించుకుంటాడు? ఆలాకలిగించుకుంటే విమర్శకుఁడుగారు ఆవ్యక్తులనుకూడా విభీషణాయిగాళ్లని నిందించడం వుంది. అది వారివిమమర్శన గ్రంథంలో వక విశేషాంశమే. కీ|| శే|| వడ్లమన్నాఁటి నరసింహశర్శనున్నూ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉద్యోగిగానున్న పింగళి లక్ష్మీకాంతాన్నిన్నీ నాఁడేమో అనఁగా గుంటూరుసీమవివాదములలో ఆవలిపక్షానికి వ్యతిరేకంగా న్యాయపక్షాన్ని వర్తించారని వీరు దూషించివున్నారు. భవతు. యిప్పుడు వీరి వుద్యమాన్ని యేబంధుసముద్రులు సమర్థిస్తారో? చూడవలసివుంది. యేదో ఆకాలంలో ఆసీమలో వివాదం జరిగిందన్నమాటే కాని అప్పుడు పరమశత్రువులుగా వున్న వారందఱున్నూ యిటీవల పరమబంధువులుగా మారినట్టు నాకు బాగా అనుభూతం అయింది. అది బ్రాహ్మణలక్షణం. యెందుకు అలాగ మాఱ రంటాను. నన్నయ్యభట్టు- "విప్రులయలుకయు తృణహుతాశనమ్ము దీర్ఘమగునె?" అని వూరికేనే అన్నాఁడా? అతఁడు లోకజ్ఞుఁడు "లోకజ్ఞునుభయభాషా" అని వూరికేనే వ్రాసుకున్నాఁడా? లేదు. యిప్పటికి సుమారు 16 యేళ్లక్రితం నేను హఠాత్తుగా గుంటూరు వెళ్లడం తటస్థించింది. అప్పుడు శ్రీయుతులు పాటిబండ సూర్యనారాయణరావుగారు (ప్లీడరు) అరండల్ పేటలోనే అనుకుంటాను వారు కట్టించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం చూడాలని బలవంతంగా తీస్కువెళ్లి యెంతో ఆదరించారు. అప్పటిమాట యెందుకు? సంవత్సరానికి పూర్వం బెజవాడలో శ్రీపాటిబండ సుందర్రావుగారు (అడ్వొకేటు) యెంతో ప్రయత్నపూర్వకంగా సపుత్రకంగా, సచ్ఛాత్రంగా, నన్ను వారింటికి పిల్చుకొని వెళ్లి సేలువలువగైరాలతో సమ్మానించి విందుకూడా చేశారు. పాటిబండవారినే ప్రత్యేకించి