పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

533


డెమ్మీ సైజు 116 పుటలలోనూ మచ్చుకేనా వకటిన్నీ యుక్తమయింది లేనేలేదు. చూడండీ మచ్చుకు వకటి చూపుతాను.

“నీవు మీసం పెంచావుగదా కవిత్వానికంటూ? మీ తిరుపతి శాస్త్రి యెందుకు పెంచాఁడు కాఁడూ?”

అనేది అందులో ఒక పూర్వపక్షం చూడండీ, దీన్ని గుఱించి యెంత వ్రాయాలోను. అసలు యీమీసం పెంచడం గొడవ యెందుకు వచ్చిందో చెప్పాలా? ఆత్మకూరు సంస్థానంలో మా దేవీభాగవతం వినిపిస్తూవుండఁగా ఆ సంస్థాన విద్వాంసులు, మహాపండితులు శ్రీనివాసాచార్లుగారు- “నాపలుకాలకింపుమ అనంత! గుణాలయనైన యట్టి" అనే పద్యంలో - గుణాలయ లక్ష్మి అనే ప్రయోగము యెట్లాసాధువు అని ప్రశ్నించారు. యేదో సమాధానం చెప్పాము. తృప్తిపడ్డారు కారు. దానిమీఁద క్రమంగా ఘర్షణ పెరిగింది. భారతం వుదాహరణంగా చూపుతామన్నాం. చూపండిగాని భారతం అంతా మేమంగీకరించే వాళ్లంకాం. నన్నయ్యభట్టుగారి కవిత్వంలోనే చూపాలన్నారు వారు; అందుకైతే మేం అంగీకరించలేదుగాని (ఓహో గ్రంథం పెరిగిపోతూవుందే! యేంచేసేది? తీఁగతీస్తే డొంక కదులుతూ వుంది కాఁబోలు) సాధ్యమైనంతవఱకు నన్నయ్యగారి ప్రయోగాన్నే చూపలేకపోతామా? (యెప్పుడూ అభ్యుపగమ్యవాదం జిగీషువులకు వుపకరిస్తుందని నా మతం.) అనే ధీమాకుతో వున్నాం. మర్నాడు నన్నయ్య గారిదే “దేవతలు ధర్మవర్తులు" అనేది యిచ్చాం. కొంపమీఁదికి వచ్చింది వారికి. దానితో మెసలడానికి వీలులేక "ధర్మవృత్తులు" అని దిద్దుతామంటూ పిడివాదం పుంతలోకి దిగారు వారు. (ఎందుచేత ప్రతివాదులకు మెసలడానికి వీలిచ్చిందికాదో? వ్రాయవలసివస్తే మఱీ గ్రంథం పెరుగుతుంది. పైగా సామాన్యులకు బోధించదుకూడాను.) దానిమీఁద జరుగుతూవున్న ఘర్షణలో వారు మా యుక్తిమీఁద పైయుక్తి తోఁచక రాజుగారితోటి ‘మహాప్రభూ! వీరు లౌక్యులు. బాగా మాట్లాడతారు. లౌక్యులైనందుకు ఆ బాఱమీసాలే గుఱుతు చిత్తగించండి" అన్నారు. మీసాలు ఆకాలంలో వైదికానికి చాలా ఆక్షేపణీయాలని వ్రాయాలా? అక్కఱలేదు. దానిమీఁద నేనన్నానుగదా? యీ మీసాలు లౌకికరీత్యా పెట్టుకున్నవికావండి. మేమూ వైదికులమే. అతఁడు వెల్నాఁటి. నేను ఆరామద్రావిణ్ణి. అయితే మీసాలెందుకు పెట్టుకున్నామంటే? యిందుకు అని అంతా సుప్రసిద్ధంగా చదువుకుంటూ వుండే మాత్రాలూకు “దోసమటం చెఱింగియును" అనే పద్యాన్ని ఆవేశంతో చదివేను. ఆపద్యరచన నాఁటికి మా వయస్సు 28 యేండ్లు దాదాపు ఆయీవయోనిర్ణయం నానారాజసందర్శనంలో వున్న “తే, కుజుఁడు భూకారకుండఁట?” అనే పద్యం