పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

534

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


(ఆసంస్థానంలో చెప్పిందే) చదువుకొని పిమ్మట జాతకచర్యలో ఉండే జననకాలదశాశేషం పరిగ్రహించి జననం మొదలుకొని లెక్కపెట్టుకుంటే లెక్కలలో చాలా ప్రజ్ఞవున్న గుం|| డి|| విమర్శకుఁడుగారికి క్షణంలో తెలుస్తుంది. నాకన్న తిరుపతిశాస్త్రి సంవత్సరం యేడు మాసాలు కాఁబోలును చిన్న యెందుకీసోదె? యెవరుసంతోషించింది? చెప్పండి? అయితే యేంచేతును. ఈ పనికిమాలినపని ఆయన కల్పనచేశారు, వృథాగా పత్రిక నిండుతూంది. "కాకస్య కతివా దంతా" చెప్పొచ్చేదేమిటంటే! యిది జరిగి యిప్పటికి 42 యేండ్లు దాటవచ్చింది. అప్పుడు నాకుమాత్రమే మీసంవున్నట్టున్నూ, తిరపతయ్యకి లేనట్టున్నూ విమర్శకుఁడుగారు అభిప్రాయపడి ప్రశ్నిస్తారే? ఆసందర్భం వీరికేలా తెలిసింది? మాయిద్దఱికీ కూడా వుండcబట్టే మీసం "పెంచినార మీమీసము” అనడం తటస్థించింది. భవతు. విమర్శకుఁడుగారివూహే సమంజసం అనుకుందాం. యిన్నాళ్లదాఁకా యీ శంకకు అవకాశం లేకపోతుందా? పాండిత్యంలో మన విమర్శకుఁడుగారివంటి పరిజ్ఞానం లేకపోవచ్చుఁగాని ఆ రాజుగారికి వొక్కరికే మీసం వుందనిన్నీ రెండోవారికి లేదనిన్నీ అట్టి సందర్భంలో "పెంచినారము" అని చెప్పడం పొసఁగదు కనక పృచ్చచేదామనేనా? అనుకోరా? వారల్లా వుండఁగా "మాట్లాడితే మారామేకు"లన్నట్లు గొంతుకపట్టి నొక్కి యేలాగేనా సంస్థానాన్నుంచి పాఱదోలుదామనే దురుద్దేశంతో వున్న ఆ పండితులు వూరుకుంటారా? వారెందుకూరుకున్నారంటే? అసలు శంకకవకాశమే లేదుకనకనే యింకేముంది?- “గజం మిథ్య పలాయనం మిథ్య" వినండి భూతార్థాన్ని అప్పుడేకాదు మఱికొంతకాలందాకా యిద్దఱికీ కూడా పూర్తిగానే (కత్తిరిమీసాలు కావు) మీసాలు వుండేవి. (మెలిఁబెట్టివిడిచిన మీసాలపై గొప్ప నిమ్మకాయలు రెండు నిలుపవచ్చు) అయితే అతనివి అంతగఱిబోజా మీసాలుకావు. వకమాదిరివి. నావో? బాగా శివాజీ మీసాలలాగు వుండేవి. ఆ మీసంతో వున్న నా ఫోటో బందరులో ప్రైవేటు డాక్టరు శేషగిరిరావువద్ద వకటి వుంటే వుండవచ్చు ననుకుంటాను. (ఎందుకీసోదె యిదేం ప్రశ్న? యేం జవాబు. యీలాటి చొప్పదంటు శంకలుచేసి పైఁగా అమంగళాశ్లీలపు బండబూతులు తిట్టి అందుకు నేను యేమీ అనక కాస్త్రయతిప్రాసల కూర్పున్నూ ధారాబాగుందని సేల్జోడుబహుమతీ చేయదలచుకుంటె దాన్ని పరిగ్రహించడం అవమానంగా భావించి యేదో చెత్తయిలాటిదే వ్రాసి కయ్యం పెంచేవారికి తమ పత్రిక తోడ్పడిందని వ్రాయబోతే గ్రంథం పెరుగుతూవుంది కదా? పెరిగితే చింతలేదు. యీ వ్రాతకూడా చెత్త వ్రాతే అవుతూ వుందికదా? చెత్తకి చెత్తేకాక మఱివకటి వస్తుందా? రాదుకదా? అవుతే మంచిదే. యేంచేసేది) విమర్శకుఁడిగారికి అవసరమైతే ఆతనిపేర వ్రాసి తెలుసుకోవచ్చును. ఈయన తిట్టినతిట్లు యెంత గర్షణీయాలో తమకే తెలుస్తుంది. ఆపత్రిక తాము చిత్తగించలేదనే నావిశ్వాసం.