పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

527

చ. ఒకరొక రుండ్రు దీరవరు లొక్కరికొక్కరు తీసిపోరు భూ
    మికి యశ మబ్బె రావణుని మెచ్చున నంచనుకొందుమేని వా
    లికి నతడింత జంకె లవలేశము లొక్కట డించి వీనులుం
    టకు విని కన్నులుంటకుఁ గనందగు నల్పుల మేమి చెప్పఁగన్.

స్వస్తి.

అనుబంధము

(షరా) ఈ వ్యాసంరాయడానికి ప్రసక్తి కల్పించిన విమర్శకుఁడు గారు రమారమి నావలెనే డెబ్ఫైయేళ్ల వృద్ధ వయస్సులోనే వున్నట్టు వారు పీఠికలో వ్రాసిన-- "వెంకశాస్త్రియు నీవును వృద్దులైరి." అనే వాక్యంవల్ల స్పష్టపడుతుంది. అయితే మేము గుంటూరు సీమలో విద్యావిషయికంగా సుమారు మూడుమాసాలకాలం వున్నరోజుల్లో యేప్రసక్తిలో గాని యీయన పేరెన్నడును వినబడ్డట్టులేదు. పలువురు శాఖాభిమానులు పద్యాలతో మమ్మల్ని గాఢంగా తిట్టి ప్రచురించేవారు. వారు వారు వారివారి పేళ్లను కూడా ప్రచురించడమే వుండేది. ఆపేళ్ల జాబితా అక్కడక్కడ గుంటూరు సీమలో ప్రచురించే వున్నాము. వీరిపేరు ఆపేళ్లలో యెక్కినట్టు లేదు. మేము పొరఁబడి వున్నామా? లేక యీయన అప్పుడీ విషయంలో జోక్యం కలిగించుకోనే లేదా అని సందేహం కలుగుతూ వుంది. యే కొందఱో "యథార్థవాది" “సత్యవాది" అనే మారుపేళ్లతో మమ్ముదూషించి ప్రచురించే మహానుభావులును వుండేవారు. ఆపేళ్లలో వీరు వొకరైవుందురా? ఇంత ఆవేశం కలవీరు వార్ధక్యం వచ్చే దాకా ఆయీ దూషణోక్తులను కడుపులో నెట్లు దాచుకోగలిగిరో? అని కూడా సందేహం కలుగుతూ వుంది. అయితే వీరు వ్రాసిన- -

“బహుకాలమునకు మరలి యీగోల యేలయని తలంతురేని...” “యిది బహుకాలము క్రిందటనే వ్రాయబడినను..."

అనే వాక్యద్వయమువలన విమర్శకుఁడుగారు చాలాకాలం క్రితమే దీన్నివ్రాసి లోకులకు జంకియో లేక మఱేకారణం వల్లనో దీన్ని దాఁచితుదకు వార్ణక్యం వచ్చాక వ్రాసిన గ్రంథం వృథా పోనేల? అని ప్రతిష్ఠార్థం దీన్ని ప్రకటించినట్లు తోస్తుంది. పూర్వ వయస్సుకన్న వృద్ధవయస్సు కొంత యుక్తాయుక్త విచక్షణత్వానికి తోడ్పడవలసి వుంటుంది. ఆపద్ధతిని తిట్లు తగ్గించుకొని శంకలుమాత్రం ప్రచురించుకుంటే అవి నిలచినా, నిలువకపోయినా యుక్తంగా వుండేది. ద్రావిడ స్త్రీల కచకుచాల దగ్గరనుంచి ప్రసక్తిగాని ప్రసక్తిగా యెత్తికొని వ్రాస్తే విమర్శనం యెక్కువ శృంగారంగా వుంటుందని ఆయనకు తోచడం ఆశ్చర్యంగా కనబడుతుంది. “రోళ్లా రోకళ్లా పాడిన" గుంటూరు సీమలోవున్న