పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

526

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రప్రథములయం దుండే గౌరవాతిశయంచేత అనుకర్తలను లోకం యేకొంచెమోతగ్గించడమే కనఁబడుతుంది. ఉపమానస్థానంకన్న ఉపమేయ స్థానాన్ని మనం యెంత వుత్కృష్టంగా వర్ణించినా తత్తుల్యంగా ఉంది అని చెప్పినట్టే అవుతుంది. ఆ యీభావాన్ని మనస్సులో పెట్టుకొనియ్యేవే దేవీభాగవతంలో మేమీ క్రింది పద్యం వ్రాశాము.

ఉ. మూగురయందు నన్నయ సమున్నతుఁడై కడులక్షణఁపుఁ బ్రో
    వై గుది గూర్చు నేర్పు గలఁడై తగు నించుక కేమి? యజ్వయున్
    లోఁగక ఆతనిన్ జెనయు, న్యూనుఁడనందగఁ డెఱ్ఱనార్యుఁ డెం
    తే గడుసుందనమ్ము గలఁ డిర్వురకున్ సరివచ్చు నన్నిటన్.

యెవరికో కోపం వచ్చిందని యిప్పుడు నేను నన్నయ్య స్థానాన్ని తిక్కన్నగారికి మార్పుచేసినా దాన్ని లోకం విశ్వసిస్తుందా? కొందఱు విశ్వసించినా మఱికొందఱు తిరగఁబడతారు.

    “... ... ... ... ... ... అందఱినిం దనియింప ಮಿಮ್ಮಿ ని
    ర్మించిన బ్రహ్మకైన దరమే! యిది పెద్ద లెఱుంగకుందురే!”

వాల్మీకి కన్నా కూడా మిన్నగా కవిత్వం చెప్పినట్టు కాళిదాసును సమర్ధించవచ్చును. కాని కాళిదాసుకు సమకాలికుఁడైన భోజరాజు -- - -

   "మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి"

అని ఆ గౌరవాన్ని వాల్మీకి యందే ఆపాదించాఁడు. సంస్కృత కవిత్వం వాల్మీకులతోనే ఆరంభంకాలేదు. వేదంలోకూడా కవిత్వపదార్థం గలవి కొన్ని భాగాలు కనపడతాయి. అయినా కావ్యరూపందాల్చింది వాల్మీకుల వాక్ప్రవాహమే. అందుచేత- “భువిఁ గవితాకన్యఁ బుట్టించె నెవ్వాఁడు” అన్న యశస్సు ఆయనకు దక్కింది. అదే విధంగానే యేదో తెలుఁగు కవిత్వం నన్నయ్యనాఁటికి కొంత వున్నప్పఁటికి

“మ. మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్"

అన్న పేరు నన్నయ్యకు దక్కింది. దానికి యెవరెంత అసూయపడ్డా ప్రయోజనంలేదు. నన్నయ తిక్కన యెఱ్ఱన పోతన మొదలైన మహనీయులందఱూ నిరుపమానులే, ధన్యులే. వీరిని గూర్చి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిందే అని యిదివఱకే వ్రాశాను. దానికి సంబంధించిందే యీ మురారి శ్లోకానువాదం-