పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/519

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

523


మహాసాహసంకదా? అట్టి సాహసానికి దిగినపాపరాజుగారు యెన్ని వన్నెచిన్నెలున్నూ పెట్టకపోతే యేలా తుదనెగ్గుతుంది? పయిగా పాపరాజుగారి వాణికూడా రసవంతమైనది కాని అల్లాటప్పా తరగతిలోనిదికాదు. కనుకనే అపహాస్యాస్పదుఁడు కాలేదు. యమకాలు వగైరా అలావుంచండి-

సీ. తిలకంబు దిద్ది "దిద్దితిఁ జూడు" మను రమా
    సుదతి చెక్కుల నీడఁ జూచువాని"

యీపద్యం శ్రీమహావిష్ణువును వర్ణించినది. చరణాలన్నీ యీలాగే వుంటాయి. అందులోనున్నూ యీ మొదటిచరణం అత్యద్భుతమైన రసికత్వాన్ని వెల్లడిస్తూ వుంది. యెందుచేతంటారా? మీరేచూచుకోండి. నన్నెందుకు చెప్పమంటారు? ప్రసక్తానుప్రసక్తంగా పాపరాజుగారు వచ్చారు. ప్రస్తుతం నన్నయ్యగారు ఆయీ కవులను గూర్చి వ్రాయవలసివస్తే వొక్కొక్కరికి వొక్కొక్కవ్యాసం పెట్టుకోవలసిందే గాని వొకరిని గూర్చి వ్రాస్తూ వేఱొకరినిగూర్చి యెత్తుకోవడం మహాపరాధంగా పరిణమిస్తుందని నేను భయపడుతూవుంటాను. ఆలా యెత్తుకోవడం పేరే. - సీ. ఒకరి పెండిలిలో మఱొక్కఁడాపల్లకీ నిరుక నుంకించుటవంటిది. వారు కోరకపోయినా మనం వారిని యిఱికించినట్లవుతుంది. దీన్ని యెఱుఁగుదును. అయినా సంబంధం వుండడంచేత స్పృశించడం తప్పింది కాదు. భారతకవులను గూర్చి యెత్తుకుంటే యిటీవలవారిని యెత్తుకోవడం మానినా అసలు ముగ్గురినేనా యెత్తుకోక వొక్కరి నెత్తుకొని విరమించడానికి బుద్ధిపుట్టదు. యెఱ్ఱన్నగారు “నాపెసరపప్పు కలసినదంతా నాదే" అన్నమాదిరిని భారతకవులైనారు. నన్నయ్యగారు అసలు ఆమహాకార్యాన్ని ప్రారంభించినవారవడంచేత భారతకవి అనేపేరు వహించారుకాని చాలా రచించికాదు. నిజంగా భారతకవి పట్టభద్రత్వం తిక్కన్నగారికే కట్టవలసి వస్తుంది.

చ. ...దుర్గమార్ధజలగౌరవ భారతభారతీసము
    ద్రముదరియంగ నీఁదను విధాతృనకైనను నేర్వఁబోలునే

అని నన్నయ్యగారి దివ్యవాణి భావికాలమందలి యనర్థాన్ని సూచించింది. సంశయాత్మా వినశ్యతి అన్నట్లు తుదకు ఆలాగే జరిగింది. సత్కవివాక్యము రిత్తవోవునే. యెన్నటికి రిత్తవోవదు. భవతు. ఆలా జరిగికొన్నాళ్లు అసంపూర్ణ స్థితిలోనే వున్న ఆ భారతాన్ని ఆంద్రీకరించడానికి సాహసించినతిక్కనగారు “యశోవా మృత్యుర్వా" అనే అభియుక్తోక్తిని మనస్సు యందుంచికొనియ్యేవే కర్తవ్యాంశమందు ప్రవర్తించినారని తోస్తుంది. ఆయన నన్నయవలె కవిమాత్రుఁడుకాక దండనాథుఁడుకూడా కదా! దండనాథునకు ప్రాణభీతి వుండదని వేఱే చెప్పనక్కరలేదు. అదిగాక– “న సాహస మనారుహ్య నరో భద్రాణిపశ్యతి"