పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

522

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నైపుణ్యమే! అప్రయత్నంగా భట్టారకుని కవిత్వంలో శబ్దాలంకారాలు కుప్పతెప్పలుగా వచ్చిపడతాయి. అందు కిదివఱలో చూపిన పద్యాలే చాలును. మఱివకటికూడా యిస్తాను.

"ఉ. భారతభారతీశుభగభస్లిచయంబులఁజేసి."

యమకకవిత్వం రసాన్ని చెడఁగొట్టుతుందని లాక్షణికులందఱున్నూ వొప్పుకొన్న విషయమే. భట్టారకుని కవిత్వంలో వున్నయమకం రసాన్ని లేశమున్నూ భంగించదు. కారణ మేమంటే నిఘంటులసహాయంతో ప్రయత్నించి సమకూర్చిన యమకమయితే కాదూ ఆదోషానికి గుఱి కావడం. అసలు అతనిధారలోనే యిమిడి వుంటుందాయె శబ్దాలంకారం. యింకొకటి తత్సమపదాలు విడివిడివి కూర్చడంలోకూడా భట్టారకుని నైపుణి అనితరసాధ్యంగా వుంటుంది.

క. దేవసములైన యనుజుల
    తో విప్రులతో రథాళితో వచ్చి యర
    ణ్యావాసము చేసెదు ధర
    ణీవల్లభ నీవు ధర్మనిష్ఠితబుద్ధిన్

పైపద్యంలో వున్న కూర్పుసాగసు అలా వుంచుదాం. వచ్చి, చేసెదు, నీవు అనేమూఁడు మాటలుతప్ప అచ్చ తెలుఁగుమాటలు లేని యీపద్యం యెంతసుళువుగా కుఱ్ఱలకుకూడా అన్వయమవుతుందో పరిశీలించండి. భక్తి అనేది సంస్కృతం, బత్తి అనేది తెలుఁగు, ఆశ్చర్యము సంస్కృతం, అచ్చెరువు తెలుఁగు, ఆయీ పదాలలో యేపదాలు సుళువుగా అర్థమవుతాయో ఆలోచించండి. ఆయీ రహస్యం భట్టారకునికి తెలిసినట్టితరులకు తెలియదేమో అనుకుంటాను. యెక్కువగా యిమిడ్చి చెప్పడం సూత్రగ్రంథాలకు అవసరం గాని పురాణాదులకు అవసరం కాదు. శ్రీ|| కం|| వీ|| పంతులుగారు భట్టారకుని కవిత్వంకంటెను, సోమయాజి కవిత్వంకంటెను కూడా నాచనసోముని కవిత్వం రసబంధురమని అభిప్రాయ మిచ్చివున్నారు. కొన్ని పద్యాలు అతఁడు కేవల కావ్యపాకంలో నడిపించివున్నాఁడు. ఆపద్యములు రసవత్తరములనుటకు సందేహంలేదు. దరహంమీఁద చూస్తే భారతకవులను మించుననడానికి నాకు వొప్పుదల లేదు. ఆరీతినే పరిశీలించి చూచేయెడల తిక్కన్నగారి శైలిని కంకంటివారిశైలి అతిక్రమించిందని చెప్పవలసి వస్తుంది. పురాణశైలితో తిక్కన్నగారు ఉత్తరరామాయణాన్ని నడిపించారు. పూర్తిగా కావ్యశైలిలో పాపరాజుగారు నడిపించారు. వారి వారి వుద్దేశాన్నిబట్టి విమర్శకులు విచారించ వలసివుంటుంది. కవిబ్రహ్మంతటివాఁడు వ్రాసినదాన్నే పుచ్చుకొని ఆంద్రీకరించడం