పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాడినపాటే

503


సమర్థనీయము, కాని “సవిశేషణస్య ప్రతిషేధః" అని యుండుటచేతను, ఇచట “సంయమధనాన్" అని విశేషణ ముండుటచేతను, చింత్యమనక తప్పదు. ఇఁక దీని సమర్ధనమునకై కొన్ని త్రోవలు కలవు, వానిని శాస్త్రులవారే తొక్కుదురు కాన నేనందులకుఁ బూనక “ఏకవచనముగా నుండునట్లు దిద్దుకొమ్మని కాళిదాసును శిక్షించుచున్నాఁడను. ఇది మీ విమర్శనము ననుకరించు తెగలోనిది కాదు. ఇచటఁ గొంత “ప్రష్టవ్యత్వమున్నది" యని మీ వంటి ప్రాజ్ఞులెల్ల నంగీకరింతురు. ఇఁక "ఉచ్చైః కులం" ఇయ్యెడ దంత్య తాలవ్యభేదము కొంత ప్రతిబంధించెడిదియే యైనను, సంస్కృతభాషలో “దంత్య చకారము లేకున్నను " ఈపదమునం గల తాలవ్యచకారము దంత్య చకారఘటిత మగు “ఉచ్చ” అనుపదమును స్ఫురింపఁజేయు నను కువాదమును మీరెట్లు ఖండింతురు? ‘చకాశే పనసప్రాయైః పురీషండ" అను లాక్షణికోదాహరణము మీరు తిలకించియే యుందురు. అట యథాకథంచిత్తుగా ముడివెట్టుటచే నిష్పన్నమైన “శేప, పురీష" శబ్దములలో శేప శబ్దము శేఫ శబ్దమునకు స్మారకమెట్లగునో ఇదియునట్లేయని యెఱుఁగుఁడు. ఆస్మారకత్వము కేవలము సంస్కృతభాషకు మాత్రమే సంబంధించినది. ఇది యట్లుకాక, తెలుఁగు భాషను బురస్కరించిన దొసఁగు కావున వైషమ్య ముండునని వారింపకుఁడు. అట్లే యగుచో సంస్కృత గ్రంథస్థములగు, “శష్పశ్యామాన్" లోనగు నిర్దుష్ట ప్రయోగములను మన యాంధ్రదేశపుఁ బుస్తకములలో, "ఘాస శ్యామాన్" అని దిద్దుటకుం గతమేమో విచారింపుఁడు. లాక్షణి కాశయ మేవిధముగాఁ గూడ నశ్లీలము స్ఫురింపఁగూడ దనియే సుఁడీ? అట్లగుటచేతనే సర్వదేశ సామాన్యభాష యగు గీర్వాణ భాషకుఁగూడ నాయాయీ దేశపు వ్యవహారమునకు లోఁగ వలసియుండుటకు లాక్షణికులు సమ్మతించియున్నారు. దానింబట్టి యీశ్లోకమునందలి, “స్నేహ ప్రవృత్తిమ్” అను పదముకూడ నశ్లీలార్థ స్ఫోరకమగుచున్నది. మాదేశమునందీ “ప్రవృత్తి" పదమున కంత ప్రాచుర్యముగా "విరేచనార్థకత్వము" లేదుగాని గద్వాలప్రాంతమున దీనికట్టియర్థము పండిత పామర సాధారణ్యముగాఁ గలదు. బహుశః మీదేశమునఁగూడఁ గల దనుకొనియెదను. దీని నిశ్చయము దీనిపై మీరు వ్రాయుదానివలనఁగాని తేలదు. ఇప్పటికి గద్వాలప్రాంత దేశవాసుల మతమున నియ్యది యశ్లీలముకాక తీరదుగదా? ఇక్కడి కిది వెట్టిత్రోవను ద్రోక్కి దిఙ్మాత్రముగా విమర్శింపఁబూనిన నాలఘు విమర్శనము. ఈ “ప్రవృత్తి"కిని సమర్థనముకలదు. గాని శాస్త్రులవారే చూపుదురు. అదినాపనిగాదు. శ్లోకములోనింకను సగముకన్న నధికము కాలేదు. శ్లోకమో? కాళిదాస కృతము, తత్రాపి, “పేరువడిన చతుష్టయములో నొకటి" శాంతం పాపం, ఇది నాబుద్ధిదోషమో? కవిదోషమో? తిలకింపుఁడు. ప్రకృత మనుసరామః. మఱియును "అబాంధవ కృతామ్" అనుచోట?