పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాండవాశ్వమేధము

489


యభిప్రాయమున నీరసమయినం గావచ్చును. ఇందులకై పెనఁగరాదు. కావున శబ్ద విచారమును గూర్చియే “స్థాలీపులాకన్యాయముగా" వ్రాసి విరమింపనెంచితిని. ఈ విషయ మిదివఱకే నానారాజ సందర్శనమునఁ జదువరులు తిలకించి యుందురు.

"... ... ... రసారస విచారము మాయదికాదు మిక్కుటం
 పు రసికులైన మీ కెఱుఁగఁ బోలని దొక్కరసమ్ము గల్గునే"

పైపద్యపాదములు శ్రీనివాస విలాసాంద్రీకరణ ఘట్టమునందలివి. ఇఁక విమర్శకుల నొకటి యభ్యర్ధింపవలసియున్నది. ఏదో మీరు సాహసైకశరణ్యముగా వ్రాసితిరి. వ్రాయునప్పుడు వెనుక ముందు లాలోచింపరైతిరి. మా గ్రంథములను విమర్శించినవారిలో మీవంటి విద్వత్తుకలవారిదివఱలోనే లేరు. కాని ఆ విమర్శనముల నాఁటికి మేము తగినంత యోపికలోనుండుటచే వారి చొప్పదంటు శంకల కన్నిటికిని విసుగుకొనకయే యుత్తరములు లిఖించుచు వచ్చితిమి. ఇప్పుడో మేమిరువురము కాక ఒక్కరైతిమి. పైఁగా షష్టిపూర్తికి దాపగుటయు, వత్సరమునుండి వ్యాధిగ్రస్తతయుగూడ దానికిఁ దోడైనవి. కావుననేదో వ్రాసి మరలఁ బత్రికను నింపక విధిగా వ్రాయవలసి యుండునెడలనే వ్రాయవలయునని యభ్యర్థించుచున్నాఁడను. లేదా? సెలవుదినములలో నొక్కపరి దర్శనమిప్పింతురేని ప్రత్యక్షములో నుత్తరమిచ్చుట కింకను నాకుఁ గొఁడొక యోపిక యున్నదని మనవిచేసుకొనుచున్నాఁడను. మీరు గూడ నన్నిట్లే కోరుదురేమో? అదియు యుక్తమే. కాని యట్టి యారోగ్యమున్నచో నేను మీరెంత వ్రాసినను నిట్లభ్యర్ధింపనే యభ్యర్ధింపనని మీరే గుణితింపఁగలరు. ఇఁకమీరు కొన్ని గర్వోక్తు లచ్చటచ్చట వ్రాసియున్నారు. అవసరమగునేని వానింజూపెదను. లేదా తమరే, చూచుకోఁగలరు. ప్రత్యక్షములోఁ దమతోఁ గొంత వాగ్వాదము చేయవలయునను కుతూహలమున్నది, అందులకుఁ దమ యనుగ్రహము తోడ్పడుగాక.

“సతాం సద్భిస్సంగః కధమపిచ పుణ్యేన ఘటతే"

★ ★ ★