పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయి బోల్తాపడుటయే - 2

473

"తిరుపతి యతండు వేంకటేశ్వరుఁడ నేను, వెరసి తిరుపతి వేంకటేశ్వరుల మేము" ఈ పద్య ముచ్చరించినది వేంకటశాస్త్రియని స్పష్టము. అపుడు తి. శా. గా రూరక యుందు రనుట సుగమము. ఇట్లే తి. శా. గారు చదువుచున్నప్పుడు వేం. శా. గా. రూరక యుందురు. అవధానసమయముననో? చెరియొక చరణముగా నొడువుదురు. కాని అపుడుగూడఁ బ్రత్యేకరచన కొంతయుండును. ఇది పలువురు ప్రేక్షకు లెఱిఁగినదే. ఇఁక ప్రస్తుత ముపక్రమింతము. ప్రథమాంకములో శుచిముఖి మాటలాడుచున్నది. అందు తి. వేం. కవులకుఁగల ప్రజ్ఞలు వ్యంగ్యమర్యాదచే నగపట్టుచున్నవి. అట్టిచో నయ్యవి తి. శా. గారి ప్రజ్ఞలా? వేం. శా. గారిప్రజ్ఞలా యని శంకించుకోవలసి యేమివచ్చెను? ఇరువుర ప్రజ్ఞలును గూడఁ గావచ్చునే? రచనకు మొదలిడినవారిరువురా, యొకరా యని శంకింపనేల? ఒకరు మొదలిడినను ఇరువురు మొదలిడినట్లే వ్రాసికొనుట తి. వేం. కవుల యాచారమైనట్లు ప్రస్తావనలోని వాక్యము ఘోషించుచున్నది కదా! వారు మొదలిడిరి, వీరు మొదలిడిరి అని వ్రాయుటకు మా యితరపుస్తకములలో నెక్కడోకాని యాధారములే దొరకవు. మధ్యకాలమున, తి. శా. గారు స్వర్గతులగుచే స్వయముగా నీవిషయ ముపోద్ఘాతములో వ్రాయుట వలన విమర్శకుఁడు దానింబట్టి వ్రేలాడఁదొడఁగెను. అంతమాత్రమున తి. వేం. కవులసమయ మేమగును? సమయము నెఱిఁగియో యెఱుఁగకో యేవో కొన్ని పుటలు భారతిలో వ్యర్ధముగా వమ్మొనర్చినను, ఈ విమర్శకుని విషయమున నింతగాఁ గలుగఁజేసికోఁదలఁపను గాని యితని హృదయమునఁ గొంత దురభిప్రాయ మున్నట్లు కనుపట్టుచున్నది. అది యెట్టిదన? ఇరువుర జీవితకాలమైనచో మా యిరువురకును, ప్రస్తుతము మా యిరువుర కుటుంబములకును, విరోధము కల్పింపవలయు ననునట్టిదియే. ఈ విషయ మాయన విమర్శనా వ్యాసములోని యక్కరములను సవిమర్శముగాఁ జదివిన బుద్ధిమంతులు గ్రహింపఁగలరు గాన విస్తరింపను. ముఖ్యాంశము, వసుదేవుని యాగమున శతావధాన మొనర్చినది శుచిముఖి మాత్రమేకాదు; వేఱొక హంసముకూడనున్నది. ఇది వాచ్యవృత్తిచేఁ దెలియుచునే యున్నది. శుచిముఖిమాత్రమే మాటలాడినప్పుడు వ్యంగ్యమర్యాదచే స్ఫురించుచున్న విద్యావిశేషములు తి. వేం. కవులిరువురకును సమన్వయించుకొనుట కేవిధమైన యభ్యంతరమునునుండదు. ఇట్టి స్థితిలో విమర్శకుఁడంత వ్రాఁత వ్రాయుటయు నాచే నింత వ్రాయించుటయు “జలతాడనము” వంటిది. అయినను వ్రాసినందులకుఁ జదువరులు నన్ను క్షమింతురుగాక-

“ముంజేతి కంకణమ్మున కద్దమేల? అన్నటులున్న మా యీ ప్రతిఫలనమే యీ విమర్శకునికిఁ గుదురలేదుగదా, మహాభారతమునందలి యీ క్రింది పద్యము సమన్విత మెట్లగునో చూతమని యుదాహరించి యిప్పటి కిద్దానిని ముగింతును.