పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/468

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

472

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తి. వెం. కవులసమయమని వ్రాసి, అందులకుఁ గల యాధారమును ప్రస్తావననుండి యుదాహరించి యున్నాను. వసుదేవునిజన్మము నప్పుడు శుచిముఖియు వేఱొక హంసమును జంటగా నుండి శతావధానము చేసినట్లు స్పష్టముగాఁ దెలియు నక్షరములు నాటకమునఁ గలవు. శుచిముఖితో జంటగానున్న హంసముపేరు వ్రాయవలసిన యావశ్యకత లేమింజేసి వ్రాయలేదు. ఆప్రశ్నము జనక మహారాజు భార్యపే రెవరనుటవంటిది. ఇది యిటులుండె. తి. వెం. కవులకు దేవీభాగవతములోని శివశక్తుల యవినాభావ ముదాహరణ మీఁబడినదిగదా! వీరిలో నెవరికిఁ బ్రాధాన్యము అను చొప్పదంటుశంకకూడారావచ్చును. కావునఁ గొన్ని యక్కరము లప్రస్తుతములేయైనను వ్రాయుదును. ద్వంద్వసమాసమును బుచ్చికొందము. "శివకేశవులు" ఇట నిరువురకును ప్రాధాన్యము తుల్యమే యైనను నొకరి కొకపరియును, వేఱొకరికి వేఱొకపరియును పర్యాయముగా ప్రాధాన్యము వివక్షింపవలసి వచ్చును. కారణమేమన? సమాసమెట వచ్చునో అచట నేకార్థీభావరూపసామర్థ్య ముండి తీరవలెను. ఆ సామర్థ్యములోని ముఖ్యాంశము విశేష్యవిశేషణభావము. అయ్యది ద్వంద్వము నందలి పదముల కితరసమాసమునందలి పదములకుంబలె సులభముగా లగింపదు. అక్కతమున నెటులో కల్పించుకోవలసివచ్చును. దాని స్వరూప మిట్టిది. ‘శివసహితః కేశవః' అని యొక పరియు, "కేశవసహితశ్శివః" అని యొకపరియు వారివారి యిచ్చ ననుసరించి చెప్పికొందు రనుకొందము. అప్పుడొకరికొకప్పుడును, వేఱొకరి కింకొకపరియును ప్రాధాన్యా ప్రాధాన్యములు వచ్చినట్లే తి. వెం. కవులలోఁ గూడ వివక్షించుకోవలెను. జంటకవులు గదాయని సభలలో మాటలాడు నపుడుగాని, యింటఁగూర్చుండి కవిత రచించునపుడుగాని కంఠస్వరములు కల్పియే యా యావాక్యము లుచ్చరింతు రనుకొనువారుండరు. ఎప్పుడెవరు మాటలాడుదురో వారు ప్రధానులు. రెండవవా రప్రధానులు. ఆయీవిషయమాబాల గోపాలముగా నెఱిఁగినదే యయ్యును దీనినిగూడ నవగతము చేసి కోనేరని విమర్శకుఁడు మాకర్మముకాలి మాకుఁ దటస్థించుటచే నింత చెత్తప్రసంగము వ్రాయవలసివచ్చినది. ఇందుల కుదాహరణముగూడ నిత్తును.

"ఒకచరణం బతండు మఱియొక్కటి నేనుమఱొక్క టాతఁడున్". ఈ పద్యము గద్వాలరాజుగారిని గూర్చి మాటలాడుసందర్భములోనిది. పేరులేనందున తి. శా, గా రుచ్చరించినదో, వేం. శా, గా రుచ్చరించినదో నిర్ణయము చేయవలనుగాదు గాని యిరువురును కంఠస్వరములు కల్పి యుచ్చరించిన దని మాత్ర మెవ్వరును చెప్పరు. మఱియొకటి,