పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/453

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికించారు ఆచార్యులుగారు

457


నాపనిగాని, వారిని వెక్కిరించడంకాదుగదా. వీరు యితరులపద్యాలు వుదాహరించడంలో అవి యెట్టివో బొత్తిగా గమనించలేదు. పద్యమయితే సరి వుదాహరిస్తూవచ్చారు. వుదాహరణకి వకటి చూపుతాను

క, ముసలాపెవ్రేలుఁజన్నుల పసవంటిది లోభివానిబ్రదుకు ధరిత్రిన్

అంటూ, స్తుతినిందల కుదాహరణంగా యిచ్చారు స్వామి. మళ్లా దేశకాల పాత్రాలు బాగా తెలిసినట్లు వ్రాఁతలో మాటలు కనపఱుస్తారు. యీ కాలంలో యీ పద్యం, అందులో ప్రస్తుతం వుదాహరించిన పూర్వార్ధాన్ని అసహించుకోని నాగరికులుంటారా? వామనుఁ డీలాటివుదాహరణాన్నే యిచ్చాఁడా? లోకంలో దీని వుదాహరణకు యీ మాత్రం మంచి పద్యమేలేకపోయిందా? దీన్నిబట్టి వీరికి ఛందోబద్ధమాత్రత్వమే పద్యానికి లక్షణంగా కనబడుతుందనుకోకతప్పదు. వ్యాకరణదోష దూషితమైనా పద్యమైతేసరి, వీరికి వుదాహరించడంలో సంశయం లేశమున్నూలేదు. చూడండి.

"శా.. ... .. . ... యెపుడేనా? యెందుకైనా? యిదేనా? వారందఱి తెల్వితేటలు సరేనా? గోపికావల్లభా!” వీరికి 'ఉదహరించు' 'ఉదాహరించు' ప్రయోగముల భేదమే తెలియదు.

దిజ్మాత్రం ఆంధ్రవ్యాకరణపాండిత్యానికి వుదాహరించాను. న్యాయ శిరోమణిగారు కనుక వీట్లతో అంతగా పని లేకపోవచ్చును. యిఁక యితర కవిత్వాలు దిద్దేధోరణి కొంచెం వుదాహరించి ముగిస్తాను-

ఉ. అంచితులైన బందుగులయందఱి ముందఱఁ జెప్పినిన్ను మె
    చ్చిందెదఁ గుంతిచేతరవిచేత నిజంబని నీకు సాక్ష్యమి
    ప్పించెద ఫల్గునప్రముఖవీరులు గొల్వఁగ నెల్ల భూమి యే
    లించెద నచ్చకీర్తివిమలీకృత సర్వదిగంతరంబుగన్.

యీ పద్యవిమర్శనా ప్రసక్తిలోనే వీరు 'చండాల' పద ప్రసంగం చేసింది. యేదో దోషం వచ్చిందన్నారు. దిద్దుఁబాటు శాసించారు. చూడండి ఆ దిద్దుఁబాటు- "నిన్ను నెల్లెడ సరే 'యనిపించెద మందలించెదన్, లేక యెల్లవారును సరే యనునట్లుగ మందలించెదన్‌'. యీదిద్దుఁబా టెట్లున్నదో సహృదయుల నిర్ణయానికి వదలుతాను. యించుగాగమయతిగాని, రలాభేదయతిగాని అంగీకరిస్తేనేకాని విశ్రమం చెడుతుంది కూడాను పైదిద్దుఁబాటులో, తి. వేం. కవులు యే ఆశుధారాకవిత్వంలోనోతప్ప ఆ రెండుయతులనూ, సుతరామున్నూ అంగీకరింపరని స్వామి యెఱుఁగ రనుకుంటాను.