పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

444

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


"యద్యపి శుద్ధం లోకవిరుద్ధం నా౽చరణీయం నాకలనీయమ్"

దీనివలన శాస్త్రముకన్న ఆచారమునకు గౌరవ మిచ్చినట్లయినది. ప్రస్తుతము లక్ష్యమాచారస్థానాపన్నము. కావున శిరోమణిగారు "పూర్వమహాకవి ప్రయోగములున్నను" అని వ్రాయుట మహాపరాధము. ఈ త్రోవను తప్ప శ్రీ కాళిదాసు గారి "ఉచ్చైః" కులం చాత్మనః లోనగునవి నిలువవు. శేఫమునకు శేపశబ్దము స్ఫోరకమైనట్లే "ఉచ్చైః" 'ఉచ్ఛ'కు స్ఫోరకమగును. ఇది యిటు లుండె. ఆలంకారకివామనుఁడు 'అవతార' శబ్దము కుదురదని వ్రాసినవ్రాఁత, దాని నాంద్రీకరించిన శిరోమణిగా రెఱిఁగినదేకదా! అగుచో నీయనకు "మా భూత్పరీ వాదనవావతారః" అను కాళిదాస ప్రయోగము కుదురునా? ఇదియు నిటు లుండంగా నీయన విశిష్టాద్వైతికదా! తఱచు శ్రీమహావిష్ణువునవతారములకు సంబంధించిన స్తోత్రములఁ బఠింపవలసి యుండునుగదా! అందు : “మత్స్యావతార గోవింద" అనునో లేక “మత్స్యావతార" అనునో చదువరులు తిలకింపుఁడు. లేక అవతరపదమే ఉచ్చరింపనిండు. అది హృదయంగమమగునో, కాదో పరిశీలింపుఁడు. ఆ యీ విషయములు మాకొఱకే వ్రాయఁబడినవికావు. ఇట్టి వెఱ్ఱిమొఱ్ఱి వ్రాఁతలు వ్రాయు జ్ఞానలవ దుర్విదగ్ధుల జ్ఞానము మిగుల శోచ్యము!

“విలువగలకవుల లక్ష్యమ్ములె తామీభార మెల్ల మోయఁగ వలయున్” “వ్యాకరణ మొక్క త్రోవ మహాకవు లొకత్రోవ" ఇత్యాదులు పైసందర్భములను బోధించుచున్నను జ్ఞానలవదుర్విదగ్ధులేదో మాకువృథగా పని కల్పించుట మానకున్నారు. ఇదిగాక ఈశిరోమణిగారికి మారచించినవి పెక్కు గ్రంథములుండఁగా ఈబొక్కమాత్రమే యుదాహరించుటకు దొరకెనా? దీనివలననీయన కేవల రంధ్రాన్వేషణతత్పరుఁడనియును, అందుచే “బొక్క" దొరికియుండుననియు ప్రాజ్ఞులనుకొని దీనికిసంబంధించిన శ్లోకమును పఠింతురు కాఁబోలును! శాంతం! పాపం. ఇంత స్తనశల్యపరీక్షచేయు నీశిరోమణి ఆంద్రీకరణమున నిలువఁదగినది, హృదయంగమమైనది యొకఘట్టముకూడ లేదే? వ్రాఁత యంతయు తప్పుల తడక, ఉదాహరించిన పద్యములలోఁ గొన్నిచోట్ల గణములే సరిపడవు. ఈయన వ్రాసెడిది లక్షణగ్రంథము. దానిలో- “అయితే, యోచించు" లోనగు నపప్రయోగములకు మితిలేదు. ఇట్టి తెల్వితేటలతో నొరులపైకి దాడి వెడలుట, ఇదియే కాఁబోలును "ఉట్టి కెగురలేనమ్మ స్వర్గాని కెగిరిందనుకొనుట."

ఇందొకరు సాహిత్య శిరోమణులు, వేఱొకరు తర్కశిరోమణులు; వీరివ్రాఁతలయందలి సారాసారములను జర్చింపఁదగువారు సహృదయులు. వారే మందలింపందగువారును అని ఇప్పటికింతతో ముగించుచున్నాఁడను.


★ ★ ★