వెక్కిరింపఁబోయి బోల్తాపడుట
443
“ఈగండం గడిచి పిండం బయలఁబడితే” అప్పుడు తక్కినది పూర్తిచేయుదును. ఏమైనను, ఇట్టి “తథాదాధానాల"తో వాదము సమంజసముకాదని లోకులు ముఖ్యముగా నన్ను నిందింతు రని యెఱుఁగుదును. ఎఱిఁగికూడా, నా కీడెబ్బదవ పడిలోసయిత మావ్యసనము బాధించుచునేయున్నది. భర్తృహరి యేమన్నాఁడు?
“విద్యాయాం వ్యసనమ్" అన్నాఁడు. ఈయన సాహిత్యశిరోమణిగారు. ఇంకొకాయన యొకపుస్తకము తెలుఁగులోనికి పరివర్తన చేసినారు. ఆయన తర్కశిరోమణి అని జ్ఞాపకము. ఆయన ఆ పొత్తములో, పనిలేని పాటగా మావ్రాఁత నెత్తికొని కొంత తెలిసీ, తెలియని వ్రాఁత వెళ్లఁబోసినారు. ఆవ్రాఁతనుగూర్చి కూడ ఈ సందర్భములో ఒక “కారుణ్యము" వేయుట మంచి దనుకొందును. కావున ఆయనవ్రాఁతను రంగాన కవతరింపఁజేయుదును.
“పూర్వమహాకవిప్రయోగము లున్నను నిట్టివి పనికిరావు" ఇది ఆయన వాక్యము. దీనివల్లనే ఆయనవ్రాఁత యంతయు బయటఁబడును. ఇట్టివనఁగా నెట్టివి? అని ఆకాంక్షించుకొందము-
“పృథ్వీభరం బొక్కటా?" వంటివి. ఇందు “బొక్కు" అని యశ్లీలార్థము స్ఫురించు చున్నదఁట! ముం దీశిరోమణిగారి హృదయము నాక్రమించిన యశ్లీలార్థము నైఘంటికులు వ్రాయనేలేదు; వ్రాసిరేయనుకొందము. ఏపూర్వమహాకవిగాని పాటింపని యపు డీలక్షణము నెవరుమన్నింతురు? కాళిదాసంతవాఁడు దీనిని లక్షింపనియపుడు తక్కినవారిగణనయేల? ఈ "పృథ్వీభరంబొక్క" యెట్టిదనగా?"చకాశే పనసప్రాయై పరీషండమహాద్రమైః" వంటిది. అనఁగా పైశ్లోకములో, "చకాశే అను క్రియలో చివరఁగల "శే" అనువర్ణమునకు “పనస” శబ్దాదియందున్నపకారమును ముడిపెట్టి "చచ్చిచెడిచాయంగల విన్నపములుగా” “శేప" శబ్దమునుసృష్టించి, ఇంతతోఁగూడ తనకిష్టసిద్ధి కాక, ఈ శబ్దము శేఫశ్శబ్దమునకు స్మారకమగునని చెప్పి దోష నిరూపణము చేసినాఁడు. ఇట్లు కష్టించి పాడుసృష్టి సేయుట చాల గర్హ్యము. అగుచో లాక్షణిహృదయ మట్లేల ప్రవర్తించెనందురా? లక్షణమనఁగా కఁట్టుబాటు. దానిని జేయునపుడు తత్కర్త యెన్ని నియమము లేర్పఱుప వలయునో అన్నియు నేర్పఱచితీరవలసినదే కాని ఇటీవల లక్ష్యలక్షణవేత్త లానియమములలో మహాకవు లెంతవఱకు గౌరవించినారో, యెంతవఱ కీసడించినారో యనునంశము తత్తత్ప్రవృత్తిం బట్టి తెలిసికొని తానేది యేని వ్రాసికోనగును. అంతియ కాని "గ్రుడ్డెద్దు చేలో బడ్డట్టు" వ్రాయతెల్వికి లక్షణము గాదు. లక్షణ మున్నను, అయ్యది మహాకవిమాన్యముగానిచో దానికి విలువ యుండదు. ఈ విశేషాంశములు చెట్టుక్రింది ప్లీడరు తెగలోని విమర్శకులకు గోచరింపవు. కవిత్వము మాటటులుంతము. ధర్మశాస్త్ర విషయ మింతకన్న గరీయము కదా! ధర్మజ్ఞ లేమన్నారో చూడుcడు.