పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

442

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆలోకోక్తిని వాడుట కర్థములేమి స్పష్టమేకదా! అగుచో ఈ విమర్శకునకు చక్కఁగా నాలుగు వాక్యములు వ్రాయుటకూడ నేర్చికోఁదగిన యవస్థయేకదా! అగుచో నెక్కడనో ఉపాధ్యాయులుగా నెటులుండి రని శంక రావచ్చును. ఇపుడు న్యాయమైన పాండిత్యముల నధఃకరించుటయు, నూటికి మూఁడవవంతు పాండిత్యములను మన్నించుటయు, ననఁగా నూటికి ముప్పదియైదు మార్కుల పాండిత్యములను మన్నించుటయు సర్వత్ర అనుభూతమే కావున నాశంక కవకాశములేదు. లేదా విద్యార్థుల యదృష్టమనియేని యనుకోవలయు. అదియటుండె. ఈ సామెతవలన విమర్శకుఁడేదో తన పితృపితామహులను ఉద్ధరించుతలఁపుతో నీవిమర్శనకు దిగెననికాని, లేదా, పేరుతెచ్చుకొనుటకై ఈ "ఘటం భింద్యాత్తు" లోనికి దిగెనని కాని యూహింపవలసియున్నది. అగుచో

“పలుకనేర్చుట బహుతపఃఫలముగాదె" అనుఘట్టములో మమ్మును లేదా, నన్నును లాకలూకాయిగాళ్లలో చేర్చిన యీవిమర్శకుఁడుగారి పూనిక కార్యకారిగాదు. ఇందులకై యెవరినో గొప్పవారిని విమర్శించి పేరుతెచ్చుకోవలయు నని సుబ్బరాయశాస్త్రులవారు వయస్సుచేఁ జిన్నలైనను, “అన్యోన్యం గురవోవిప్రాః" అనునభియుక్తోక్తి ననుసరించి ప్రార్ధింపఁబడుచున్నారు. ఇంతియకాక యిపుడేని మమ్మనుగ్రహించి షష్టిపూర్తి ముద్రణమును జిత్తగింపవలయుననికూడాఁ బ్రార్ధింపఁ బడుచున్నారు. మఱియును మీవంటి విమర్శకాగ్రగణ్యులకు మావంటి లాకలూకాయిలను విమర్శించుట

“మొనగాఁ డొక్కరుఁ డాఱు మాసములు సామున్ జేసి మార్మూలఁ బంబిన భీపెంపున డాఁగియున్న ముసలాపెం బోరికిం జీరులా-గున”

అనుపద్యార్ధమున కుదాహరణము కాఁగలదనికూడ మనవిచేయుచున్నాను.

చదువరులారా! ఇక్కడకీయనచూపిన విరోధమెట్టిదో మీకు విశదమేకదా? ఇంకను ఈయన యింతతో విరమింపలేదు.

"వేంకటశాస్త్రిగారీ చిక్కులను పరిశీలింపక శుచిముఖిపాత్రకు జంటతగిల్చి, చిలవలు పలవలు పెంచినారు.” అనియెత్తికొనియేమో కొంత నిస్సారపు ప్రసంగము వెళ్లబోసినారు.

ఈయన వాడిన "వెక్కిరింపబోయి” అనుసామెతనుబట్టి యీయన కౌచిత్యజ్ఞాన మెంతయుండునో, ఇంతటి యాచిత్యజ్ఞుఁడు పాత్రౌచిత్య విమర్శన కేమాత్రము తగియుండునో చదువరులు పూర్తిగ గ్రహించియే యుందురుగాన శాస్త్రులవారి చెట్టుక్రింది ప్లీడరు కబుర్లకు ఇప్పటి కింతతో సమాధానము వ్రాయుపూనికనుండి విరమింతును.