పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుద్దేశానుసారంగా వారి వారి కథాకల్పనలు వుంటూవుంటాయి. యేదో మహత్తు వుండడానికి అవకాశం వున్నవాళ్ల విషయంలో యీలాటి యితిహాసాలు పరంపరగా వస్తూ వుండడంచేతనే అనుకుంటాను, యిటీవల సామాన్యవ్యక్తులను గుఱించి కూడా యీలాటివి కల్పన చేస్తారు. యివి పామరముఖతః రావడమూ వుంది. పండితముఖతః రావడమూఉంది. మొదటిదానికంటె రెండోదాని యందు ప్రామాణ్యం యెక్కువ వుంటుందని చెప్పనక్కఱలేదు. కాని వారు కూడా కొందఱు అతిశయోక్తి కల్పనలు చేస్తూనే వుంటారని నాఅనుభవంలో వున్నది వొకటి చూపుతాను.

నేను కావ్యాలను చదువుకొనే రోజుల్లోది యీ కథ; కాని నాకు షష్టిపూర్తి దాటిన తరవాత బయలుపడింది. లంక బ్రహ్మ సోమయాజులు అనే వక శిష్యునివల్ల విన్నాను. దాని స్వరూపం యిది; నే నేమో, గురువుగారివద్ద పాఠం కంగాబంగా చదవడమేగాని ఆ పాఠాన్ని వల్లించడమంటూ వుండేదికాదనిన్నీ దాన్ని కనిపెట్టి వకనాడు ఆ గురువుగారు కూకలేసేటప్పటికి- "అయ్యా! నే చదువుకొనే పుస్తకంలో నన్నెక్కడ అడుగుతారో, అడగండి" అన్నాననిన్నీ వారు అడిగారనిన్నీ వందలకొలది శ్లోకాలు సవ్యాఖ్యానంగా వప్పజెప్పాననిన్నీ వొక గురువుగారు చెప్పినట్లు ఆ సోమయాజులు నాతో అనగా విని, యిది కేవలమూ ఆ గురువుగారికి నాయందు వుండే అనుగ్రహాతిశయంగా భావించి- "నాయనా, ఇది నిజంకాదు, నా పాఠమందు నేనెన్నడూ అశ్రద్ధగా వుండటమంటూ లేదు. విశేషించి వర్లన లేకుండానే నాకు శ్లోక వ్యాఖ్యానాలు స్వాధీనం కావడం మాత్రం నిజం. పై కథ దాన్ని అనుసరించి పుడితే పుట్టిందేమో? కాని నిజంమాత్రంకాదు” అని అతనితో చెప్పి వున్నాను. అతడు విశ్వసించాడో, లేదో? యెన్నో చోట్ల వున్న యథార్థాన్ని నేను ప్రకటిస్తూనే వున్నప్పటికీ మామూలు కథలు కథలుగానే నడుస్తూన్నాయి.

“అమంత్రోపాసకౌ సంతా వపి కాళీ దయాకరౌ!
 తిర్పతి ర్వేంకటేశశ్చ పరస్పరహితౌచ యా"

అని కాళీ సహస్రంలో కంఠోక్తిగా, మాకు క్రమమైన ఉపాసన లేదని చెప్పబడి వున్నా మంత్రోపదేశంకోసం మమ్మల్ని వెూవెూట పెట్టేవారెందఱో వుండడం అనుభూతం. వొకాయన కౌముదిదాకా చదువుకొని నా దగ్గిరికి విద్యాభ్యాసవ్యాజంతో (అసలు వుద్దేశం అదికాదు) వచ్చి అహోబలపండితీయం మొదలెట్టి చదువుతూ, నాలుగైదురోజులయిన తరవాత అసలు కోరికను, బయలుపఱిచాడు. నాకు ఆలాటి శక్తియుక్తులు లేవంటే; ఉపదేశించడానికి అంగీకారం లేక ఆలా చెప్పినట్టు భావిస్తాడుగాని విశ్వసిస్తాడా? అందుచేత యథార్థం చెప్పినా ప్రయోజనంలేదు. కనక సరే దీన్ని చదువుతూ వుండు, మంచిరోజు