పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/405

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీలాపనిందలు

409


ఆయా నడివింటి శాస్త్రుల్లుగారికి సంబంధించిన మంత్రశాస్త్ర పాండిత్యం లోగడ మాప్రధాన గురువువల్ల వినివుండడంచేత నాకు విశ్వాసంగానే కనపడింది. ఆయీ నడివింటివారి చరిత్రకు సంబంధించిన గాథలు చాలా వున్నాయి. మఱొకప్పుడు ముచ్చటించుకుందాం. సంస్కృతంలో అత్యాశుధారతో వీరు రచించిన శ్లోకాలు చాలా వున్నాయి. బొబ్బిలిలో వీరికి నాల్లోతరంవారో, అయిదో తరంవారో యిప్పుడు వున్నారు. అమలాపురం తాలూకా ముమ్మిడివరం ప్రాంతంలోనూ కొందఱు వున్నారు. సంస్కృతభాషాభ్యాసానికి మొట్టమొదట ప్రారంభించి చదివే శబ్దమంజరి వీరు రచించిందే. దానిలో “శ్రీమధ్య మందిరకుల” అన్నమాటకు సరియైన నడివింటి (నడివింటి - నడిమి + యిల్లు నడిమిల్లు) పదం కొంత సంప్రదాయజ్ఞులకుగాని బోధపడదు. నేను మా గ్రామాన్నిగూర్చి “కంకణ గ్రామంబు కాపురంబు" అని వాడివున్నాను. మా ముత్తాతగారు “వలయపురం" అంటూ వాడివున్నారు. యిది అనాదిగాకవుల ఆచారం. యీ శాస్త్రుల్లు గారి అల్లుడు రెడ్డి శాస్త్రుల్లుగారు ప్రాచీనకాలపు ప్లీడరు. కొంత సంస్కృతసాహిత్యం వున్నవారు. ఆయనకు సిద్ధాంతకౌముది చదవాలనే కుతూహలం వుండి మామగారిని కోరేటప్పటికి ఆయన మనఃపూర్తిగా ఆశీర్వదించినట్లున్నూ ఆపట్లాన్ని కౌముది పేలపిండిగా రెడ్డిశాస్త్రుల్లుగారికి అన్వయమై నట్లున్నూ బహుమంది చెప్పగా వినడం. యివి అసత్యమనడానికీ వల్లకాదు. నిజమనడానికిన్నీ వల్లకాదు, కొన్ని యిప్పుడుకూడా వున్నాయి. కాని వాట్లని వ్రాస్తే కొందఱు సహృదయులు విశ్వసిస్తారు. గాని కొందఱో గేలిచేస్తారు కాబట్టి దీన్ని ఆపి ప్రస్తుతం అందుకుంటాను.

వీట్లల్లో కొన్ని గౌరవాపాదకాలుగానున్నూ కొన్ని లాఘవాపాదకాలుగానున్నూ కొన్ని ఉభయాపాదకాలుగానున్నూ వుంటాయి. శ్రీ శంకరాచార్యులవారు మద్యం పుచ్చుకోవడానికి సంబంధించిన కథ ఒకటి వుంది. చాలామంది చెప్పుకుంటూ వుంటారు. శిష్యులుకూడా వారిని అనుసరించి – “మనోజనో యేన గత స్పపంథా" కనక మద్యపానం మొదలుపెట్టే టప్పటికి ఆచార్యులవారు దాన్ని వారించడానికి వొక కంచరి దుకాణంలో కరుగుతూవున్న సీసాన్ని కొంత మంచినీళ్లప్రాయంగా గడగడ తాగి మిగిలినదాన్ని శిష్యులకి యియ్యబోయేటప్పటికి యే శిష్యుడున్నూదాన్ని గ్రహించక పాఱిపోయారనిన్నీ తద్ద్వారాగా ఆ శిష్యులకు బుద్ధివచ్చి మద్యపానాన్ని మానడం తటస్థించిదనిన్నీ చెప్పుకుంటారు. యిది నిజమైనదే అయితే నీలాపనిందలలో చేరదు. కానిపక్షంలో - అనగా కల్పితమే అయితే శంకరాచార్యుల వారియందు "కర్తు మకర్తు మన్యథా కర్తుం సమర్థత్వాన్ని" - ఆపాదించే వుద్దేశమే కాని యీ కథలో దురుద్దేశం లేశమున్నూ లేదు. బాగా ఆలోచిస్తే యీ కల్పనలు చేసేవారిలో సదుద్దేశపరులున్నూ వుంటారు; దురుద్దేశపరులున్నూ వుంటారు. వారివారి