పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

387


కనక యిఁక ఆ ఆశ పూర్తిగా వదులుకోవలసిందే. యిట్టి సమయంలో సనాతనులు సభలు సాగించడం వగయిరాలు వృథాపరిశ్రమగా నాకు తోస్తుంది. అస్పృశ్యులు దేవాలయంలోకి వస్తే అభ్యంతరంపెట్టడంకూడా పొరపాటు. వొక్క ఆ యా ఆలయాలవల్ల జీవనం వున్న అర్చకులు తప్ప తక్కిన పూర్వాచారపు చేదస్తంగల చాతుర్వర్ణ్యంవారంతా తమకు యిష్టం లేకపోతే ఆ ఆలయాలలోకి వెళ్లడం మానుకొని హరిజనుల వశంచేస్తే యెంతో బాగుంటుందని నాకు తోస్తుంది. అయితే అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నించే మహామహోపాధ్యాయుల పాదరేణువుకుకూడా నిజానికి సరిపోని నాకు తోఁచేమాత్రంవూహ వారికి తోఁచదనుకోడం కూడా పొరపాటులో మఱో పొరపాటు కాకపోదు. అయినా యింతకన్న కర్తవ్యం యీకాలానికి లేదని నాకు తోఁచి వెళ్లఁగక్కాను. అర్చకులు హరిజనులపాఠశాలల్లో వుండే బ్రాహ్మణ టీచర్లతో పాటున్నూ, అక్కడికి వెళ్లి పరీక్షించే యినస్పెక్టర్లతో పాటున్నూ ఆ ఆలయాలని కనిపెట్టుకునే వుండడానికి అంగీకారం వుంటే, అంతకుమించిన జీవనం మఱోటి లేకపోయిన పక్షంలో యింకా కొంతకాలం కనిపెట్టుకు వుంటారు. వారిని భోజనభాజనాదులలో యెవరుగాని నిషేధించకూడదు. జీవనార్థం యెవరేనా యేపనికేనా సిద్ధపడక తప్పదుగదా! తమకు దేవుఁడు కావలసివస్తే గృహదేవతార్చన యేమయింది! తన యింట్లోకి కూడా వచ్చి హరిజనులు అడ్డుతగిలేకాలం యింకా రాలేదు. కనక కొన్నాళ్లదాఁకా యీలా సంతృప్తి పడచ్చును. ఆస్థితికూడా వస్తేనో 'నందో రాజాభవిష్యతి' దీన్ని సవరించవలసివస్తే దేవుఁడు సవరించఁగలఁడేమో కాని పండితులూ, గిండితులూ యెన్ని వేదశాస్త్రాలు చదివి ఎంత కొమ్ములు తిరిగినవారైనా సవరించలేరు. పండితులన్నా వారిమాటలన్నా యిప్పుడు లోకానికి పూర్తిగా యేవగింపు. దేవుఁడు కలఁగజేసుకోని పద్ధతిని పండితులు తమవాదమే తప్పనుకొని ఆయా ధర్మశాస్త్రాల్లో వుండే నిషేధప్రతిపాదకస్మృతులను త్యజించి దైవసమ్మతమైన మార్గంలోనే తాముకూడా ప్రవర్తించడం యుక్తమని నాకు తోస్తుంది. దేవుఁడేమో యీ అనాచారానికి శిక్షిస్తాఁడనికదా వీరికి భయం.దేవుఁడే వూరుకుంటే యింక భయమెందుకు? యిది విషయాంతరం.

మా సమస్యాపూర్తి మహారాణీగారి యొక్కానున్నూ వారి జడ్జీ యొక్కానున్నూ సమ్మతికి పాత్ర మయిం దన్నది ప్రస్తుతం. వారు మమ్మల్ని తిట్టినతిట్లకు బ్రాహ్మలవడం కాకుండా సంస్థానపండితులు కూడా అవడంచేత వూరికే వాచా మందలించడం జరిగేదే కాని జరిమానా వగైరా లేమీ జరగలేదు. అట్టి కోరిక మాకున్నూలేదు. అట్టిపని ఆ సంస్థానాలలో యెన్నఁడూ పండితుల విషయంలోనే కాదు, తదితర విషయంలోకూడా బ్రాహ్మలవిషయంలో జరగనే లేదని విన్నాను. అందులోనూ గద్వాలవిషయం మఱీ యెక్కువగా చూడాలి. దానికి కారణం కేశవభొట్లనే బ్రాహ్మణపిల్లవాఁడిద్వారా ఆ వైభవమంతా వారికి