పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

386

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

మా ప్రయత్నం లేకుండానే యీ సంగతి యేలాగో సంస్థానం వారికి తెలిసింది. అప్పుడు అమ్మగారు రాజ్యంచేస్తూవున్నారు. జడ్జీ ఒక మహమ్మదీయ పండితకవి. ఆయనకు తెలుఁగురాదు. అమ్మగారి సెలవు ప్రకారం మా యిద్దఱి పద్యాలూ మామావల్లనే అర్థం విని యోగ్యతా యోగ్యతలు విమర్శించారు. మా పద్యమేమో జనరల్‌గా వుంది. వారిదేమో కేవలమూ "తిరుపతి వేంకటేశ్వరుల” అని మా యిద్దఱిపేర్లతోనూ వుండడంచేత అందులో వున్న గ్రామ్యపుతిట్లన్నీ మాకే సంబంధిస్తూ వున్నాయి. దానికి ఆ పండితులు “యిది వీరికి సంబంధించిన దూషణకాదు; తిరుపతి వేంకటేశ్వరస్వామికి సబంధించిం” దంటూ అనాలోచనగా అర్థం చెప్ప మొదలేశారు. ప్రక్కనే తెరచాటున వున్న మహారాణీగారు విని "అయ్యా చాలించండి, మీరూ మీరూ మనుష్యులు తిట్టుకున్నా తిమ్ముకున్నా అంత చిక్కులేదు. దీనిలో దేవుణ్ణికూడా యెందుకు తిడతా"రని మందలించారు. మా పద్యంలో వక్క మాట మాత్రం గ్రామ్యదోషం తగిలేది వుంది. అదే లేకపోతే ఆ పద్యంలో లేశమూ అయుక్తం లేనేలేదు. ఆ మాట తెలఁగవడంచేత నధికారికి అయుక్తమనే సంగతి గోచరించిందికాదు. పైఁగా మేము వ్యాఖ్యానం చేయడంలో వేదాంతపరంగా ఆపద్యం మొత్తాన్ని వ్యాఖ్యానించి, ఆయన కూడా కవే కనక ఆయన్ని సంతోషపెట్టడం జరిగింది. ఆ పద్యంలో మూడక్షరాలు మాత్రం అనర్హంగా వున్నాయి గాని తక్కినదంతా మంచి పాకంలోనే వుంది. జనరల్‌గావున్న పద్యంలో కొన్ని అక్షరాలను మాత్రం పుచ్చుకొని తమమీఁద పెట్టుకొని మమ్మల్ని పేరెట్టి ఆడరాని మాటలు ఆడడం తప్పని అధికారికిన్నీ అమ్మగారికిన్నీ పూర్తిగా బోధపడింది. అయినా ఆ సంస్థానాల్లో, యిప్పుడేమో చెప్పలేను గాని, అప్పటికింకా బ్రాహ్మలని శిక్షించతగ్గపని చేసినా శిక్షించడం లేదు. కనక వారికి యేమీ శిక్ష వేయలేదు. శ్రీ ఆత్మకూరిరాజావారి ముద్రను సృష్టించిన వక గ్రామకారణాన్ని ఖైదైతేచేశారుగాని ఏపూట కాపూట స్నానసంధ్యాద్యనుష్టానాలకిన్నీ భోజనానికిన్నీ బ్రాహ్మణ గృహానికి తీసుకువెడుతూ వుండేవారు. పండితులందఱు సంస్థానానికి వార్షికాలకు వచ్చే వుత్సవ దినాల్లో ఆ కరణాన్ని మొదటిదర్వాజాలో సంకెళ్లసహితంగా కూర్చోపెట్టేవారు. ఒకనాఁడు రాజుగారున్నూ, మేమున్నూ కలిసి వచ్చే సమయంలో ఆబ్రాహ్మణ్ణి గూర్చి రాజుగారు మేము అడగకుండానే "స్వామీ! యేంచేసేది? బ్రాహ్మడు. మళ్లా మంచినిష్టాపరుఁడు. పెద్దహానికి తగ్గ పనిచేశాఁడు అందుచేత ఖయిదుచేయడం తప్పిందికాదు. కులాచారానికి మాత్రం భంగం కలిగించకుండానే జరుపుతూ వున్నాం" అంటూ సెలవిచ్చారు.

మన్వాది ధర్మశాస్త్రాలను ఆరీతిగా శూద్రప్రభువులుకూడా చెక్కుచెదరకుండా కాపాడుకొనివస్తే కలియుగంలోకూడా కొందఱు కాకపోతే కొందఱేనా ఆ ఆచారాలు యే కొంచెమో ఆచరించడం తటస్థించింది. క్రమంగా "కంచే చేనుమేయడం" దగ్గఱికి వచ్చింది.